
కూటమి పాలనపై ఏడాదికే వ్యతిరేకత
సాలూరు: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుచేయకుండా మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజావ్యతిరేకత మొదలైందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు పీడిక రాజన్నదొర అన్నారు. సాలూరులో మంగళవారం నిర్వహించిన వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే రైతులు, మహిళలు, యువత తదితర వర్గాలు బహిరంగంగా కూటమి పాలనను వ్యతిరేకిస్తున్నాయన్నారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు, లేదంటే అప్పటివరకు నెలకు రూ.3వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారని, నేటికి ఒక్కరికీ కూడా భృతి అందజేయలేదన్నారు. రాష్ట్రంలో కోటీ 56 లక్షల మంది నిరుద్యోగులుంటే 20 లక్షల మంది ఉన్నట్టు లెక్కలు వేయడం చంద్రబాబు మోసపూరిత పాలనకు నిదర్శనమన్నారు.
ఆడబిడ్డ నిధి అమలెప్పుడు?
గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున అందజేశారని, కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధికింద ఇస్తామన్న నెలకు రూ.1500 ఎప్పుడిస్తారని రాజన్నదొర ప్రశ్నించారు. కోటీ 60 లక్షల మంది మహిళలు పథకం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమ్మఒడి పథకం లబ్ధిని సుమారు 80 లక్షల మంది పిల్లల తల్లుల ఖాతాలకు జమచేస్తే నేడు ఎంతమంది పిల్లలుంటే అంతమందికే అని చెప్పి కేవలం 64లక్షల మందికే ఇచ్చారని, మిగిలిన 16 లక్షల మంది చదువులు మానేశారా అని ప్రశ్నించారు. చాలా మంది ఎస్సీ విద్యార్థులకు రూ.8వేలు, రూ.10 వేలు మాత్రమే జమచేయడం విచారకరమన్నారు. 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని ఊరించి ఉసూరు మనిపిస్తున్నారన్నారు.
లోకేశ్‌ను సైకో అని ఎందుకు అనకూడదు?
గత ప్రభుత్వం అమ్మఒడి పథకం కింద ఇచ్చే రూ.15వేలలో పాఠశాలల నిర్వహణ కోసం తొలుత రూ.వెయ్యి, తర్వాత రూ.2వేలు కేటాయిస్తే జగన్ సైకో అంటూ విమర్శలు చేసిన ప్రస్తుత విద్యాశాఖమంత్రి లోకేశ్‌ను ఇప్పుడు పెద్దసైకో అని ఎందుక అనకూడదని రాజన్నదొర ప్రశ్నించారు. మహిళల ఆత్మగౌరవం కాపాడతానని, పది రోజుల్లో రూ.20లక్షల ఖర్చుతో పట్టణంలోని మరుగుదొడ్లకు మరమ్మతులు చేయిస్తామని మంత్రి సంధ్యారాణి చెప్పారని, నేటికీ పనులు చేయకపోవడం విచారకరమన్నారు. మక్కువ రోడ్డు మూడు నెలల్లో పూర్తిచేస్తామని చెప్పిన మంత్రి ఆ విషయాన్ని మర్చిపోయారన్నారు. గత ప్రభుత్వ హయాంలో తహసీల్దార్ కార్యాలయం నిర్మాణం, ట్రజరీ కార్యాలయం ఆధునికీరణ, ఎంపీడీఓ కార్యాలయం, బైపాస్‌రోడ్డు, విత్తనశుద్ధి కేంద్రం తదితర భవనాల నిర్మాణాలు పూర్తిచేసినట్టు వెల్లడించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 70 శాతం మేర వందపడకల ఆస్పత్రి పనులు పూర్తిచేశామని, కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో మిగిలిన 30 శాతం పనులు పూర్తిచేయలేదని విమర్శించారు.
మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు పీడిక రాజన్నదొర