
యూరియా కోసం నిరసన
బలిజిపేట: మండలంలోని చిలకలపల్లి గ్రామంలో అవసరమైన రైతులకు యూరియా అందడం లేదని, నాయకులకు, కార్యకర్తలకు అందిస్తున్నారని రైతులు కృపారావు, ఉమామహేశ్వరరావు, వెంకటి, మురళి తదితరులు రైతు సేవా కేంద్రం వద్ద మంగళవారం ఆందోళన చేశారు. గ్రామంలో రైతులు, కౌలు రైతులకు యూరియా దొరకకపోవడంతో అవస్థలు పడుతున్నామని వాపోయారు. వచ్చిన యూరియాను నాయకులు, కార్యకర్తలు సర్దుకుంటున్నారని ఆరోపించారు. ప్రైవేట్ మార్కెట్‌లో సక్రమంగా అందుబాటులోకి రావడం లేదని, వచ్చినా అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. నారుకు ప్రస్తుతం యూరి యా ఎంతో అవసరమని తక్షణమే రైతులకు అవసరమైన యూరియాను సరఫరాచేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కష్టాలు మొదలయ్యాయంటూ వాపోయారు.