
విస్తృతస్థాయి సమావేశం విజయవంతం చేయాలి
● ఎమ్మెల్సీ విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే కళావతి
పాలకొండ: వైఎస్సార్‌సీపీ చేపడుతున్న పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతిలు కోరా రు. ఈ మేరకు గురువారం పాలకొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 5న పార్వతీపురం మన్యం జిల్లా పార్టీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజ్ అధ్యక్షతన పార్వతీపురం జిల్లా కేంద్రంలో ఉదయం 10 గంటలకు సమావేశం ఉంటుంద ని తెలిపారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అనుబంధ విభాగాల సభ్యులు సమావేశానికి విధిగా హాజరు కావాలని పిలుపునిచ్చారు.
నిలకడగా తోటపల్లి నీటి ప్రవాహం
గరుగుబిల్లి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా కురుస్తున్న వర్షాలకు తోటపల్లి ప్రాజెక్టువద్ద నీటిప్రవాహం నిలకడగా ఉంది. నాగావళినదిలో తోటపల్లి ప్రాజెక్టువద్ద గురువారం సాయంత్రానికి 105 మీటర్ల లెవెల్‌కు గాను 104.5 మీటర్ల లెవెల్‌లో నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం నదిపై భాగం నుంచి ప్రాజెక్టుకు 3,558ల క్యూసెక్కుల నీరు రాగా ఈ మేరకు అధికారులు ఒక గేటును ఎత్తివేసి 3వేల క్యూసెక్కుల నీటిని నదిలోకి విడిచిపెడుతున్నారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 2.53 టీఎంసీలకు గాను 2.216 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టు వద్ద నీటిపరిస్థితిని ఇంజినీరింగ్ ఏఈ కిశోర్ పర్యవేక్షిస్తున్నారు.
బ్లడ్ బ్యాంక్‌లకు షోకాజ్ నోటీసులు
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో ఐదు బ్లడ్ బ్యాంక్‌లకు ఔషధ నియంత్రశాఖ అధికారులు షోకాజ్ నోటీసులు జారీచేశారు. అధికారుల పరిశీలనలో బ్లడ్ బ్యాంక్‌ల్లో రికార్డుల నిర్వాహణ సక్రమంగా లేకపోవడం, కొన్ని నిబంధనలు పాటించకపోవడం వల్ల నోటీసులు జారీచేసినట్టు ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె.రజిత తెలిపారు. విజయనగరంలోని న్యూ లైఫ్‌బ్లడ్ బ్యాంక్, ఎన్‌వీఎన్ బ్లడ్ బ్యాంక్ , బొబ్బిలిలోని బొబ్బిలి బ్లడ్ బ్యాంక్, రాజాంలోని జీఎంఆర్ బ్లడ్ బ్యాంక్, నెల్లిమర్లలోని మిమ్స్ బ్లడ్ బ్యాంక్‌లకు నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించారు.