
కౌలు రైతులకు రుణాలు అందించాలి
పార్వతీపురంటౌన్: కౌలు రైతులకు రుణాలు అందించాలని కలెక్టర్ ఎ శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖలతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 11 వేల మందికి సీసీఆర్ కార్డులు జారీ చేయాలని లక్ష్యంగా ఉందన్నారు. గత ఏడాది 9,500 వరకు కార్డులు జారీ అయ్యాయని తెలిపారు. కౌలు రైతులను గ్రామ రెవెన్యూ అధికారులు, వ్యవసాయ సహాయకులు నిర్ధారించాలని ఆదేశించారు. సీసీఆర్ కార్డుల జారీ అనంతరం రుణాలు అందించాలని పేర్కొన్నారు. నిబంధనలు పాటిస్తూ వాస్తవ లబ్ధిదారులకు రుణాలు అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. అవసరమైతే జాయింట్ లయబుల్ గ్రూప్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వం రేషన్ కార్డుల జారీకి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందేనని, 21 రోజుల్లో సంబంధిత విచారణ పూర్తి చేయాలని ఆదేశించారు. సీతంపేట, మక్కువ తదితర మండలాల్లో ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నాయని, తక్షణం పూర్తి చేయాలని కోరారు.
అన్నదాత సుఖీభవకు ఆధార్ అనుసంధానం కావాలి
జూన్ 1వ తేదీ నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న అన్నదాత సుఖీభవకు రైతుల ఆధార్ అనుసంధానం కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వెబ్‌ల్యాండ్‌లో ఉన్న ప్రతి ఒక్కరి ఆధార్ అనుసంధానం కావాలన్నారు.
వీఆర్‌ఓలు ప్రధాన కేంద్రాల్లో ఉండాలి
జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామ రెవెన్యూ అధికారులు ప్రధాన కేంద్రాల్లో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలను తక్షణం అప్రమత్తం చేయాలని, సమాచారం ఎప్పటికప్పుడు జిల్లా కేంద్రానికి వెంటనే అందించాలని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎస్‌ఎస్ శోభిక, పార్వతీపురం ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ, సీతంపేట ఐటీడీఏ పీఓ, పాలకొండ సబ్‌కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత తదితరులు పాల్గొన్నారు.