
సంఘాలుగా ఏర్పడితే రాయితీలు
పార్వతీపురం రూరల్: ప్రభుత్వం అమలుచేస్తోన్న పథకాల రాయితీలు, రుణాలు వర్తించేలా రైతులు సంఘాలుగా ఏర్పడాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ రైతులకు పిలుపు నిచ్చారు. పార్వతీపురం మండలం వెలగవలస గ్రామంలో గురువారం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. నిమ్మగడ్డి సాగు, దిగుబడి, ఆదాయం, సాగులోని సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. నిమ్మగడ్డి సాగుకు సాగునీటి సమస్య ఉందని పలువురు రైతులు కలెక్టర్‌కు తెలిపారు. రైతులు సంఘాలుగా ఏర్పడి ఉమ్మడిగా బావులు తవ్వి సోలార్ విద్యుత్ మోటార్లు అమర్చుకోవాలని సూచించారు. దీనికోసం రాయితీలు వర్తిస్తాయన్నారు.
సూక్ష్మ నీటి సేద్యం కింద స్ప్రింక్లర్లు ఉచితంగా అందిస్తామని స్పష్టంచేశారు. నిమ్మగడ్డి సాగుకు ఉపాధి హామీ పథకం వర్తింపజేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఆయిల్ ఉత్పత్తికి అవసరమైన బ్రాయిలర్ల ఏర్పాటుకు రైతుల భాగస్వామ్యం అవసరమన్నారు. నూజివీడు సీడ్స్ సంపద రకం వరి విత్తనాలు సరఫరా చేయాలన్న రైతుల వినతిమేరకు వ్యవసాయ శాఖ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అదే రకమైన 1318 రకం విత్తనాలు అందుబాటులో ఉంచుతామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ దాలమ్మ, జిల్లా ఉద్యానవన అధికారి బి.శ్యామల, ఎంపీడీఓ గోర్జి రమేష్ బాబు, మండల ఉద్యానవన అధికారి ప్రియాంక, పంచాయతీ కార్యదర్శి వి.భార్గవ్, ఫీల్డ్ అసిస్టెంట్ పి.నూకరాజు, పంచాయతీ కార్యదర్శి వి.భార్గవ్, తదితరులు పాల్గొన్నారు.
రుణ లక్ష్యాలు అధిగమించాలి
పార్వతీపురంటౌన్: జిల్లాలో కిసాన్ క్రెడిట్‌కార్డుల రుణాలపై బ్యాంకర్లు తక్షణమే స్పందించాలని, లక్ష్యాలు అధిగమించాలని కలెక్టర్ ఎ. శ్యామ్‌ప్రసాద్ స్పష్టం చేశారు. కేసీసీలో వచ్చిన దరఖాస్తులన్నీ 15 రోజుల్లోగా పరిష్కరించాలన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బ్యాంకు అధికారులు, పలు శాఖల అధికారులతో గురువారం నిర్వహించిన బీసీసీ, జిల్లాస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ 2024 సంవత్సరానికి తీసుకున్న పంట రుణాలు తిరిగి చెల్లించిన రైతులకు ఈ ఏడాది రుణాలు మంజూరు చేయాలని సూచించారు. మైక్రోఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక ఊతం కల్పించాలన్నారు. కార్యక్రమంలోజిల్లా పశుసంవర్థక శాఖాధికారి డాక్టర్ ఎస్.మన్మథరావు, ఎల్‌డీఎం ఎన్.విజయ్‌స్వరూప్, డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణి, జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ ఎం.వి.కరుణాకర్, డీసీసీబీ బ్యాంక్ సీఈఓ సీహెచ్ ఉమామహేశ్వరావు, జిల్లా సహకార శాఖాధికారి పి.శ్రీరామ్మూర్తి , ఏఎల్‌డీఎం కె.మౌనిక, ఇతర బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్