
విద్యారంగంలో తీవ్ర సంక్షోభం
● ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ఉద్యమం
● కూటమి ప్రభుత్వంలో పాఠశాలల
మనుగడ ప్రశ్నార్థకం
● జిల్లా కేంద్రంలో ఏపీటీఎఫ్ నిరసన
పార్వతీపురంటౌన్: రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ ఒక ప్రయోగశాలగా మారిందని, ప్రస్తుత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా విఫల ప్రయోగాలు చేపడుతోందని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు అశాసీ్త్రయమైన తొమ్మిది రకాల పాఠశాలలను బలవంతంగా ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తున్నామని ఏపీటీఎఫ్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిరసన చేపట్టారు. ప్రతి గ్రామంలో ఒకటి నుంచి ఐదు తరగతులతో కూడిన మోడల్ ప్రాథమిక పాఠశాల లేదా బేసిక్ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాలని, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున నియమించాలని, ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 55ప్రకారం ఉన్నత పాఠశాలలో 45 మంది విద్యార్థులు దాటితే మరో సెక్షన్ మంజూరు చేయాలని కోరుతున్నారు. ఆ తరువాత ప్రతి 35 మందికి ఒక్కొక్కరు చొప్పున పాఠశాల సహాయకులను నియమించాలని, పూర్వ ప్రాథమిక విద్యాకేంద్రాలను ప్రాథమిక పాఠశాలలతో అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో తెలుగు మీడియం తప్పనిసరిగా కొనసాగించాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు బకాయి పడిన మూడు డీఏలు గత పీఆర్‌సీ ఎరియర్స్ వెంటనే చెల్లించాలని, నూతన పే రివిజన్ కమిటీని నియమించి కనీసం 30 శాతానికి తగ్గకుండా మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈనెల 14న విజయవాడలో రాష్ట్రస్థాయి ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఈ ధర్నా శిబిరంలో వివిధ మండలాల ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జిల్లా సబ్ కమిటీ సభ్యులు, జిల్లా కౌన్సిలర్లు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.