
అమ్మ పండగలో అపశ్రుతి
సాలూరు: పట్టణంలోని శ్యామలాంబ అమ్మవారి పండగ అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం ఉయ్యాల కంబాలు, సోమవారం తొలేళ్ల ఉత్సవం జరగ్గా.. మంగళవారం సిరిమానోత్సవం భక్తజన సంద్రం నడుమ వేడుకగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సిరిమానును తిలకించారు. మొక్కులు చెల్లించుకున్నారు. అయితే మంగళవారం సిరిమానోత్సవం జరుగుతున్న క్రమంలో అపశ్రుతి దొర్లింది.
విరిగిన అమ్మవారి అంజలి రథచక్రం
మంగళవారం సాయంత్రం భక్తజనం నడుమ సిరిమానోత్సవం ప్రారంభమైంది. జన్నివారు సిరిమానును అధిరోహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు జై శ్యామలాంబ అంటూ చేసిన నామస్మరణ నడుమ సిరిమాను నాయుడు వీధి రామమందిరం నుంచి కదిలింది. సాయంత్రం 4.05 గంటలకు సిరిమాను ప్రారంభ ముహుర్తం కాగా కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. సిరిమాను వద్ద కట్టిన తాళ్లు తెగిపోగా వెంటనే వాటిని సరి చేశారు. దీంతో సిరిమాను కదిలింది. కొద్ది సేపటికి బోసు బొమ్మ సమీపంలో రూరల్ సీఐ కార్యాలయం వద్దకు చేరుకోగా అంజలి రథం ఎడమ చక్రం విరిగింది. దీంతో సిరిమానోత్సవం తాత్కాలికంగా ఆగింది. వేరే చక్రం తీసుకువచ్చి ఏర్పాటు చేస్తామని వెల్లడించిన నిర్వాహకులు సుమారు రాత్రి 9 గంటల సమయంలో నూతన చక్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సిరిమానోత్సవంలో ఏమైనా పొరపాట్లు దొర్లి ఉంటే శ్యామలాంబ తల్లే తమను మన్నించాలని భక్తులు వేడుకున్నారు.
అమ్మవారిని దర్శించుకున్న
జిల్లా కలెక్టర్, పీవో
శ్యామలాంబ అమ్మవారిని జిల్లా కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇంచార్జ్ పీవో అశుతోష్ శ్రీవాస్తవ అమ్మవారిని దర్శించుకున్నారు. సిరిమాను ఊరేగింపు ప్రక్రియను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
శ్యామలాంబ అమ్మవారి పండగ నేపథ్యంలో పట్టణంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పాటలు, నృత్యాలు, బళ్ల వేషాలు, తప్పెటగుళ్లు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ప్రతి చోట భక్తుల సందడి కనిపించింది.
ఏర్పాట్లపై కలెక్టర్ అసహనం
పట్టణంలో శ్యామలాంబ పండగను భక్తులు తమ స్థాయి కొలది ఘనంగా నిర్వహించుకున్నారు. పండగ ఏర్పాట్లు నేపథ్యంలో అడుగడుగునా ఆంక్షలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పట్టణానికి తరలివచ్చారు. అమ్మవారి ఆలయానికి సుదూర ప్రాంతాల్లోనే పార్కింగ్‌లతో భక్తుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. శ్యామలాంబ ఆలయంలో భక్తుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదు. క్యూలైన్లో ఉండే భక్తుల కోసం తాగునీరు, మజ్జిగ విరివిగా అందించే ఏర్పాట్లు చేయలేదు. దీన్ని గుర్తించిన జిల్లా కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ పండగలో కొరవడిన ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేశారు.
రూరల్ సీఐ కార్యాలయ సమీపంలో విరిగిన అంజలి రథచక్రం
నిరుత్సాహ పడిన భక్తజనం
ఘనంగా శ్యామలాంబ అమ్మవారి సిరిమానోత్సవం

అమ్మ పండగలో అపశ్రుతి

అమ్మ పండగలో అపశ్రుతి

అమ్మ పండగలో అపశ్రుతి

అమ్మ పండగలో అపశ్రుతి