
సీరాజ్ కాల్ డేటాపై ఎన్‌ఐఏ ఆరా!
విజయనగరం క్రైమ్:
విజయనగరం ఆబాద్ వీధికి చెందిన సీరాజ్ ఉర్ రెహ్మన్ ఉగ్ర మూలాలపై ఎన్‌ఐఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సోమవారం దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ అధికారులు రెండో రోజు మంగళవారం కూడా రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మధ్యాహ్నం వరకు మకాం వేశారు. ఈ సమయంలో సీరాజ్ ఉపయోగించిన ఫోన్ ఆధారంగా కాల్ డేటాపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిసింది. తన ఫోన్‌లో ఐదుగురు గ్రూపు సభ్యులతో కలిసి ఏర్పాటు చేసుకున్న వాట్సాప్ చాటింగ్‌పై ఆరా తీసినట్టు సమాచారం. ఎస్‌ఐ శిక్షణ తీసుకునే సమయంలో హైదరాబాద్‌లో సమ్మీర్‌తో ఏర్పాటైన సంబంధాల నుంచి నేటి వరకు ఆయన కాల్ డేటాను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. అసలు ఆయనకు ఉగ్ర మూలాలకు ఎక్కడ బీజం పడిందన్న దానిపై లోతైన సమాచారం సేకరిస్తున్నట్టు సమాచారం. ఉగ్ర వాదులతో సంబంధాలు ఎక్కడ ఏర్పడ్డాయి? ఎవరెవరితో ఈ సంబంధాలు కొనసాగుతున్నాయి... పేలుళ్లకు కుట్ర ఎక్కడ పన్నారు... ఎవరెవరితో దీనికి స్కెచ్ వేశారన్న దానిపై ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఇటు విజయనగరం, అటు హైదరాబాద్‌లో కలసి పేలుళ్లకు సమ్మీర్‌తో కలిసి పన్నిన కుట్రకు ఎక్కడ బీజం పడిందనే కోణంతో లోతుగా ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇదే సమయంలో ఆయన కుటుంబ సభ్యులను విచారణ చేసే పనిలో ఉన్నట్టు తెలిసింది. విజయనగరంలో పలు చోట్ల పేలుళ్లకు స్కెచ్ వేసిన సీరాజ్ ఏఏ ప్రాంతాల్లో వీటికి పథక రచన చేశాడన్న దానిపై కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఎన్‌ఐఏ అధికారులు విచారణ మరింత వేగవంతం చేశారు.
రెండో రోజు దర్యాప్తు ఉగ్ర మూలాలపై ప్రత్యేక దృష్టి