
మెరుగైన వైద్య సేవలు అందివ్వాలి
● ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు
గుమ్మలక్ష్మీపురం: ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందివ్వాలని ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.డీవీజీ శంకరరావు అన్నారు. మంగళవారం గుమ్మలక్ష్మీపురం వచ్చిన సందర్భంగా మండలంలోని తాడికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి సదుపాయాలు, రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. జ్వరంతో చికిత్స పొందుతున్న బాలుడ్ని పరీక్షించారు. ఆరోగ్య స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఏజెన్సీలో జ్వరాలు పెరుగుతున్నాయని, మెరుగైన వైద్యం జ్వర పీడితులకు అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రత్యేక దృష్టి సారించాలని పార్వతీపురం ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకెళ్తానని తెలియజేశారు. అంతకు ముందు ఆయన తాడికొండ గ్రామంలో మాతృ వియోగం పొందిన సాక్షి రిపోర్టర్ జి.పెంటయ్యను పరామర్శించారు.
జూన్ 15 నుంచి
అవగాహన కార్యక్రమాలు
● జిల్లా కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురం టౌన్: ధర్తీ ఆబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ (డీఏజేజీయూఏ) అవగాహన కార్యక్రమాలు జూన్ 15 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్(పీఎం జన్‌మాన్) ధర్తీ ఆబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కార్యక్రమాలను త్రికరణ శుద్ధితో అమలు చేసేందుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా గిరిజన ప్రాంతాలలో సేవలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. సాంప్రదాయ ప్రచారాల మాదిరిగా కాకుండా ఈ ప్రచారం గ్రామ స్థాయి/క్లస్టర్ స్థాయి శిబిరాల ద్వారా హక్కులను క్షేత్ర స్థాయిలో అందించేలా చూస్తుందని తెలిపారు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆయుష్మాన్ భారత్ కార్డ్(పీఎంజేఏవై), కుల, నివాస ఽధ్రువీకరణ పత్రం, కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ), పీఎం కిసాన్, జన్‌ధన్ ఖాతా, బీమా కవరేజ్, సామాజిక భద్రత (వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, దివ్యాంగ పెన్షన్), ఉపాధి, జీవనోపాధి పథకాలు (ఎంజీఎన్‌ఆర్‌ఈజీ, పీఎం విశ్వకర్మ, ముద్ర రుణాలు), సీ్త్ర, శిశు సంక్షేమం, ప్రయోజనాలు, ఇమ్యునైజేషన్ మొదలైనవి అందించనున్నట్టు పేర్కొన్నారు. పీవీటీసీ గృహాలు, గిరిజన గ్రామాలను గుర్తించడం, గ్రామ/క్లస్టర్ స్థాయి ప్రయోజన సంతృప్త శిబిరాలను నిర్వహించడం, ఆరోగ్యం, ఆహారం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సామాజిక న్యాయం, వ్యవసాయం, రెవెన్యూ ఇతర విభాగాల సమన్వయంతో ప్రచార కాలంలో తదితర కార్యకలాపాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఆధార్, ఈకేవైసీ డాక్యుమెంటేషన్ సంబంధిత సేవల కోసం సంబంధిత విభాగాలు పని చేస్తాయన్నారు. ప్రధానమంత్రి జన్మాన్, ధర్తి ఆబా అభియాన్ కింద ఊహించిన విధంగా సమ్మిళిత, సాధికారత కలిగిన గిరిజన సమష్టి దార్శనికతను ముందుకు తీసుకెళ్లడంలో ఈ ప్రచారం కీలకమైన అడుగు అని కలెక్టర్ అన్నారు. శిబిరాలను పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని ఆయన ప్రజలను కోరారు.
డీఎంహెచ్‌వో ఆకస్మిక పరిశీలన
చీపురుపల్లి రూరల్ (గరివిడి): గరివిడి మండలం బొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌వో జీవనరాణి మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో ఓపీ, ఐపీలను పరిశీలించి శత శాతం ఈహెచ్‌ఆర్ అబా నంబరుతో ఆన్‌లైన్ చేయా లని సూచించారు. ప్రతీ ఓపీకి అవసరమైన పరీక్షను నిర్వహించాలన్నారు. ల్యాబ్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. హెచ్‌బీ టెస్ట్‌ను మెరుగుపరచాలని సూచించారు. ఐపీ వార్డును పరిశీలించి చిన్న పిల్లల వ్యాక్సిన్‌ను పరిశీలించారు. ఓపెన్ ఓవెల్ పాలసీని అనుసరిస్తున్నారా... లేదా.. అని వ్యాక్సిన్‌ను పరిశీలించారు. మెడికల్ స్టోర్‌లో బిన్ కార్డ్స్‌ను పరిశీలించారు. విటమిన్ ఏ సిరప్ తగిన మోతాదులో ఉందో.. లేదో పర్యవేక్షించారు. అనంతరం ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు.

మెరుగైన వైద్య సేవలు అందివ్వాలి