విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్‌ల నేతృత్వంలో సహస్ర కుంకుమార్చన చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయం వెనుక ఉన్న వేప, రావిచెట్ల వద్ద దీపారాధన చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించి తరించారు. కార్యక్రమాలను ఆలయ ఇన్‌చార్జ్ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్ పర్యవేక్షించారు.
ఘనంగా చండీయాగం
ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి చండీయాగం మంగళవారం చదురుగుడి, వనంగుడిలలో ఘనంగా నిర్వహించారు. ఆలయ వేదపండితులు వెలువలపల్లి నరసింహమూర్తి, సాయికిరణ్, దూసిశివప్రసాద్, తాతా రాజేష్‌లు శాస్త్రోక్తంగా యాగప్రక్రియను నిర్వహించారు. యాగం అనంతరం భక్తులకు అమ్మవారి శేషవస్త్రాలను, ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
కబడ్డీలో కాంస్యం
శృంగవరపుకోట: సీబీఎస్‌ఈ స్టేట్‌జోన్ కబడ్డీ పోటీల్లో స్థానిక డా.వరలక్ష్మి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు కాంస్య పతకం సాధించారు. ఈ మేరకు స్కూల్‌లో జరిగిన వార్షికోత్సవంలో పాఠశాల వ్యవస్థాపకురాలు డాక్టర్ పి.వరలక్ష్మి కబడ్డీలో పతకాలు సాధించిన విద్యార్థులను అభినందించి ట్రోఫీ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యాబోధనలో వచ్చిన మార్పులకు అనుగుణంగా విద్యావ్యవస్థను రూపొందించడంతో పాటు విద్యార్థులకు క్రీడల్లోనూ తర్ఫీదు ఇచ్చి తయారు చేయడంతో పాఠశాల అధ్యాపక బృందాన్ని ప్రశంసించారు.
పుష్పాలంకరణలో పైడితల్లి
పుష్పాలంకరణలో పైడితల్లి