వీరఘట్టం: కొద్ది రోజులుగా టమాటోకు గిరాకీ లేక రైతులు నానా అవస్థలు పడ్డారు. కనీసం కిలో రూ.5కు ఇద్దామన్నా కొనుగోలుచేసేవారే కరువయ్యారు. టమాటో ఉత్పత్తి తగ్గడంతో ధర కాస్త పెరిగింది. వీరఘట్టం మార్కెట్‌లో కిలో రూ.10లు ధర పలకడంతో రైతులు ఊరట చెందారు.
21న జాబ్‌మేళా
సీతంపేట: ఐటీడీఏ ఆధ్వర్యంలో ఈ నెల 21న సీతంపేట వైటీసీలో జాబ్ మేళా నిర్వహిస్తామని ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ, అసెంబ్లీ ట్రైనీ, ప్రొడక్షన్ ట్రైనీ, మిషన్ ఆపరేటర్ ఉద్యోగాలకు ఉద్యోగమేళా ఉంటుందన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన 18 నుంచి 35 ఏళ్లలోపు వయస్సుగల యువతీయువకులు అర్హులన్నారు. 6 కంపెనీలకు అవసరమైన 250 మంది ఉద్యోగులను ఎంపిక చేస్తాయన్నారు. నెలకు రూ.16వేల నుంచి రూ.20 వేలు వరకు వేతనం ఉంటుందన్నారు. వివరాలకు సెల్: 70320 60773కి నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
ప్రతి శుక్రవారం
గృహ నిర్మాణ దినోత్సవం
పార్వతీపురంటౌన్: ప్రతి శుక్రవారం గృహ నిర్మాణ దినోత్సవంగా పాటిస్తామని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. గృహనిర్మాణ శాఖ అధికారులతో ఆయన సోమవారం మాట్లాడుతూ జిల్లాకు కేటాయించిన 7వేల ఇళ్ల నిర్మాణ లక్ష్యాన్ని జూన్ నాటికి పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలని గ్రామ పంచాయితీ అధికారులను ఆదేశించారు. అనుమతులు లేకుండా ఎలాంటి భవన నిర్మాణాలు జరగరాదన్నారు. పింఛన్ల మంజూరుకు ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ హేమలత, హౌసింగ్ ఇన్‌చార్జి పీడీ పి. ధర్మచంద్రారెడ్డి పాల్గొన్నారు.
గిజబ ప్రధాన రోడ్డులో
ఏనుగుల గుంపు
గరుగుబిల్లి: మండలంలోని గిజబ ప్రధాన రోడ్డులో సోమవారం ఏనుగులు సంచరించాయి. అరటి, పామాయిల్ పంటలు నాశనం చేయడంతో పాటు ఎప్పుడు ఎవరిపై దాడిచేస్తాయోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రధాన రహదారిపై సంచరిస్తుండడంతో రాకపోకలకు స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఏనుగులను తరలించి ప్రజల ప్రాణానికి రక్షణ కల్పించాలని కోరారు.
28న తపాలా అదాలత్
విజయనగరం టౌన్: విశాఖపట్టణం పోస్టల్ రీజియన్ పరిధిలోని తపాలా వినియోగదారుల ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ఈ నెల 28వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు విశాఖపట్నంలోని పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయంలో 117వ తపాలా అదాలత్ నిర్వహించనున్నట్టు తపాలాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె.వి.డి.సాగర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి విజయనగం జిల్లా తపాల వినియోగదారులు తమ సమస్యలను ఈ 24వ తేదీలోగా ‘117వ తపాలా ఆదాలత్’, కె.వి.డి.సాగర్, అసిస్టెంట్ డైరెక్టర్, పోస్టుమాస్టర్ జనరల్ వారి కార్యాలయం, విశాఖపట్నం–530017 చిరునామాకు పంపించాలని కోరారు. గడువు తేదీ తరువాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించమని పేర్కొన్నారు.
గురుకులాల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పెంపు
నెల్లిమర్ల: మహాత్మాజ్యోతిబా పూలే గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతి వరకు, కళాశాలల్లో ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష దరఖాస్తు గడువు ఈ నెల 25వ తేదీ వరకు పెంచినట్టు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ కేబీబీ రావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష మే 4న జరుగుతుందన్నారు.
కాస్త పెరిగిన టమాటో ధర