పార్వతీపురంటౌన్: పాఠశాలలకు నేటి నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.తిరుపతినాయుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. జిల్లాలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్న 67 పాఠశాలల్లో పరీక్షలు ముగిసేంత వరకు మధ్యాహ్నం 1.15 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.
నేటితో చెరకు క్రషింగ్ పూర్తి
రేగిడి: మండలంలోని సంకిలి వద్ద ఉన్న ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారంలో శనివారంతో చెరకు క్రషింగ్ పూర్తవుతుందని కర్మాగారం యాజమాన్య ప్రతినిధులు తెలిపారు. స్థానిక విలేకరులతో శుక్రవారం మాట్లాడుతూ ప్రతి రోజు 4వేల పైచిలుకు టన్నుల చెరకు క్రషింగ్ చేశామని, ఇప్పటివరకు 3.50 లక్షల టన్నుల చెరకు క్రషింగ్ పూర్తయిందన్నారు. రైతులు కర్మాగారానికి చెరకును తరలించిన వారం రోజులకే బిల్లులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు వెల్లడించారు.
బీసీల స్వయం ఉపాధికి రూ.23.24 కోట్లు
పార్వతీపురంటౌన్: జిల్లాలో బీసీ వర్గాల స్వయం ఉపాధికి బీసీ కార్పొరేషన్ నుంచి రూ. 23.24 కోట్లు మంజూరు చేస్తామని కలెక్టర్ ఎ. శ్యామ్‌ప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో స్లాబ్–1కింద 868 యూనిట్లకు రూ.13.02 కోట్లు, స్లాబ్–2 కింద 260 యూనిట్లకు రూ.6.50 కోట్లు, స్లాబ్–3 కింద 93 యూ నిట్లకు రూ.3.72 కోట్లు వెరసి 1221 యూనిట్లకు 23.24 కోట్లు అందజేస్తామన్నారు.
27 జనరిక్ ఫార్మసీలకు అవకాశం
25 జనరిక్ ఫార్మసీ యూనిట్లను ఏర్పాటుకు రూ.2కోట్ల వరకు ఆర్థిక సహాయం అందుతుందని కలెక్టర్ తెలిపారు. యూనిట్ విలువ రూ.8 లక్షలు కాగా ఇందులో సబ్సిడీ రూ.4 లక్షలు, బ్యాంకు రుణం రూ.4 లక్షలుగా ఉంటుందని చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు జనరి క్ ఫార్మసీ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవచ్చని, ఈబీసీకి ఒక యూనిట్, బ్రాహ్మణ వర్గానికి ఒక యూనిట్ కేటాయించామన్నారు. దీనికోసం ఈ నెల 22లోగా హెచ్‌టీటీపీఎస్://ఏపీఓబీఎంఎంఎస్.ఏపీసీఎఎస్‌ఎస్.ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
కొత్తూరు వైపు ఏనుగుల గుంపు
భామిని: ఇన్నాళ్లూ భామిని మండలంలో సంచరించిన ఏనుగుల గుంపు శుక్రవారం శ్రీకాకుళం జిల్లా కొత్తూరు వైపు వెళ్లాయి. వసప, కుంటిభద్ర, సిరుసువాడ పంటపొలాల్లో సంచరిస్తున్నట్టు ఆటవీశాఖాధికారులు తెలిపారు.
నేటి నుంచి ఒంటిపూట బడులు