● జిల్లాలో సాగుతున్న పీ–4 సర్వే ● ప్రజల వద్దకు వెళ్లి, వివిధ అంశాలపై అధికారుల బృందం ఆరా ● సంక్షేమ పథకాల కోతకేనా? అంటూ ప్రభుత్వ సిబ్బందిని నిలదీస్తున్న లబ్ధిదారులు | - | Sakshi
Sakshi News home page

● జిల్లాలో సాగుతున్న పీ–4 సర్వే ● ప్రజల వద్దకు వెళ్లి, వివిధ అంశాలపై అధికారుల బృందం ఆరా ● సంక్షేమ పథకాల కోతకేనా? అంటూ ప్రభుత్వ సిబ్బందిని నిలదీస్తున్న లబ్ధిదారులు

Mar 15 2025 1:47 AM | Updated on Mar 15 2025 1:46 AM

సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం:

జిల్లాలో మార్చి 8 నుంచి పీ–4 సర్వే (పబ్లిక్‌, ప్రైవేట్‌, పీపుల్‌ పార్టనర్‌ షిప్‌) కొనసాగుతోంది. జిల్లాలో 2.65 లక్షల గృహాలను ప్రభుత్వ యంత్రాంగం సర్వే చేస్తోంది. రోజుకు 90 ఇళ్ల వరకు సర్వే చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌, ప్రజల భాగస్వామ్యంతో ప్రతి ఇల్లూ పేదరికాన్ని అధిగమించి.. ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసే ఉద్దేశంతో ఈ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని జిల్లా అధికారులు చెబుతున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో సచివాలయ సిబ్బంది అడుగుతున్న ప్రశ్నలకే ప్రజలు కంగుతింటున్నారు. సంక్షేమ పథకాల ఏరివేతకేనా? ఇటువంటి ప్రశ్నలు వేస్తున్నారని పలువురు లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.

మొత్తం 27 ప్రశ్నలు..

మొత్తం పేదల్లో అట్టడుగున ఉండే 20 శాతం నిరుపేదలను గుర్తించేందుకు కూటమి ప్రభుత్వం ఈ సర్వే ప్రారంభించింది. ఆయా కుటుంబాల నుంచి సామాజిక, ఆర్థిక స్థితిగతులపై 27 ప్రశ్నలను సచివాలయ సిబ్బంది ద్వారా సేకరిస్తున్నారు. ఇంటింటి నుంచి సమాచారాన్ని సేకరించి, సర్వే నిర్వహణకు ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో నమోదుచేస్తున్నారు. సర్వే సందర్భంగా కుటుంబ యజమాని ఆధార్‌, బ్యాంకు ఖాతా, ఫోన్‌ నంబర్లతో పాటు.. ఇంట్లో టీవీ, ఫ్రిజ్‌, వాషింగ్‌ మెషిన్‌, ఏసీ, ల్యాప్‌టాప్‌/కంప్యూటర్‌ వంటివి ఉన్నాయా? అన్న విషయాలను ఆరా తీస్తున్నారు. ఇంట్లో సంపాదించే వ్యక్తులు ఎంతమంది.. ఆస్తులు (వృత్తి, వ్యవసాయం, భూమి, పట్టణ ఆస్తి వివరాలు, వాహనాలు) ఏ మేరకు ఉన్నాయి.. నెలకు ఎంత కరెంటు బిల్లు వస్తుంది.. వంట గ్యాస్‌ వినియోగిస్తున్నారా, కుళాయి కనెక్షన్‌ ఉందా? కుటుంబ నెలవారీ ఖర్చు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏవైనా తీసుకుంటున్నారా? తదితర ప్రశ్నలు వేస్తుండడంతో ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి. ఇంట్లో ఎవరైనా ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న వారున్నా, ఆదాయ పన్ను చెల్లించేవారు, నాలుగు చక్రాల సొంత వాహనం ఉన్నవారిని సర్వే నుంచి మినహాయించడం గమనార్హం.

వివరాలు చెప్పేందుకు నిరాకరణ

కుటుంబాల వ్యక్తిగత వివరాల సేకరణ సమయంలో సచివాలయ సిబ్బందికి లబ్ధిదారుల నుంచి సహకారం కొరవడుతోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అర్హతే ప్రామాణికంగా ప్రతి ఇంటికీ ఏదో ఒక సంక్షేమ పథక లబ్ధిని అందించింది. గత ఎన్నికలకు ముందు రాజకీయంగా లబ్ధి పొందేందు కు అనర్హులు ప్రభుత్వ పథకాలను పొందుతున్నారంటూ కూటమి నేతలు దుష్ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వస్తే.. అనర్హులను ఏరివేస్తా మంటూ ప్రకటనలు చేశారు. అధికారంలోకి రావ డంతోనే సంక్షేమ పథకాల లబ్ధిని తగ్గించడం ప్రభు త్వం ప్రారంభించింది. పింఛన్లలో పెద్ద ఎత్తున కోత విధించింది. కొత్త పింఛన్లు మంజూరు ఎండమావి గా మారింది. గత ప్రభుత్వం అమలు చేసిన వివిధ సంక్షేమ కార్యక్రమాలను ఎత్తివేసింది. దీంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు పీ–4 సర్వే పేరిట ఇంటింటి నుంచి వివరాలు సేకరిస్తుండడం.. బ్యాంకు ఖాతా, ఆధార్‌ వంటివి అడగడంతో ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంక్షేమ పథకాల లబ్ధిని దూరం చేసేందుకే ఈ వివ రాలన్నీ అడుగుతున్నారని సచివాలయ సిబ్బందిపై మండిపడుతున్నారు. తమ వివరాలు చెప్పేందుకు చాలా మంది నిరాకరిస్తున్నారు.

సర్వేపై అపోహలు వద్దు

ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పీ–4 సర్వేను రూపొందించింది. ప్రస్తుతం సర్వే ప్రక్రియ గ్రామాల్లో చురుగ్గా సాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయితే ఈ నెల 21న సర్వే సమచారాన్ని గ్రామసభల్లో ప్రదర్శిస్తాం. సర్వేపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. పేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఈ సర్వేను చేపడుతోంది. – కె.రామచంద్రరావు, డుమా పీడీ, పార్వతీపురం మన్యం జిల్లా

● జిల్లాలో సాగుతున్న పీ–4 సర్వే ● ప్రజల వద్దకు వెళ్లి, 1
1/2

● జిల్లాలో సాగుతున్న పీ–4 సర్వే ● ప్రజల వద్దకు వెళ్లి,

● జిల్లాలో సాగుతున్న పీ–4 సర్వే ● ప్రజల వద్దకు వెళ్లి, 2
2/2

● జిల్లాలో సాగుతున్న పీ–4 సర్వే ● ప్రజల వద్దకు వెళ్లి,

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement