
గంజాయి కేసులో ముద్దాయిలు
విజయనగరం క్రైమ్: గంజాయి కేసులో ఇద్దరు ముద్దాయిలకు 15 ఏళ్లు జైలు శిక్ష, ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తూ ఒకటవ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి జి.రజని బుధవారం తీర్పు వెల్లడించినట్లు రూరల్ సీఐ టీవీ తిరుపతిరావు తెలిపారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. విజయనగరం రూరల్ పరిధిలో రాకోడు– పినవేమలి గ్రామాల మధ్య 2018 పిబ్రవరి 19న అప్పటి రూరల్ ఎస్సై పి.రామకృష్ణ వాహన తనిఖీలు చేపట్టగా, గంట్యాడ మండలం నరవ గ్రామంలోని ఏఎంజీ.కాలనీకి చెందిన చలుమూరి గంగునాయుడు, విజయనగరం పట్టణానికి చెందిన పెసల శ్యాంసన్‌లు వేర్వేరు మోటార్ సైకిల్స్‌పై నరవ నుంచి వస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.
ఈ సందర్భంగా వారి నుంచి 65 కిలోల గంజాయిని అప్పటి తహసీల్దార్ సమక్షంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై అప్పటి రూరల్ సీఐ డి.లక్ష్మణరావు కేసు దర్యాప్తు చేపట్టి, నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించి, అభియోగపత్రం దాఖలు చేశారు. ఎస్పీ ఎం.దీపిక ఆదేశాలతో ప్రస్తుత రూరల్ సీఐ టీవీ తిరుపతిరావు ఈ కేసును ప్రాధాన్య జాబితాలో స్వీకరించి, కోర్టు విచారణలో సాక్షులను ప్రవేశపెట్టి ప్రత్యేక శ్రద్ధ వహించడంతో నిందితులపై నేరారోపణలు రుజువయ్యాయి. ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.రవి పోలీసుల తరఫున వాదనలు వినిపించారు.