ఎవరిదీ నిర్లక్ష్యం? | - | Sakshi
Sakshi News home page

ఎవరిదీ నిర్లక్ష్యం?

Oct 22 2025 9:13 AM | Updated on Oct 22 2025 9:13 AM

ఎవరిద

ఎవరిదీ నిర్లక్ష్యం?

ఆస్పత్రుల్లో క్షతగాత్రులు

పార్వతీపురం రూరల్‌: పొట్టకూటి కోసం కాంప్లెక్స్‌కు వచ్చిన వారు ఒకరు.. డ్యూటీలో భాగంగా బస్సు నడిపిన వారు మరొకరు.. రిక్షా సవారీ కోసం ఇంకొకరు.. వేరే పనిమీద మరొకరు... పార్వతీపురం కాంప్లెక్స్‌లో ఆదివారం మందుగుండు సామగ్రి పేలుడు ఘటనలో గాయపడ్డారు. ఆ ప్రమాదంతో వీరికి ఎలాంటి సంబంధం లేదు. కానీ గాయాలపాలై ఆస్పత్రుల్లో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. విజయనగరంలో ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా, వ్యవస్థను మోసం చేస్తూ పేలుడు పదార్థాలను ఫ్యాన్సీ ఐటెమ్స్‌పేరుతో పార్సిల్‌ చేయడం, వాటిని పరిశీలించే నిఘా వ్యవస్థ ఆర్టీసీలో లేకపోవడమే దీనికి ప్రధాన కారణమన్నది బాధితులు, ప్రయాణికుల ప్రధాన ఆరోపణ. ఆదాయం వస్తుందనే ఆశే తప్ప ఆర్టీసీలో భద్రతాపరమైన అంశాలపై దృష్టిసారించేవారే లేరన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విజయనగరంలో ట్రాన్స్‌పోర్టు సర్వీసు నిర్వహిస్తున్న రవీంద్ర అనే వ్యక్తి పంపిన పార్సిల్‌ నలుగురిని తీవ్రంగా గాయపరించింది. వారి కుటుంబాల్లో కల్లోలం నింపింది.

నిర్లక్ష్యం కాదా?

ఆర్టీసీ కార్గో వ్యవస్థలోని నిలువెత్తు నిర్లక్ష్యం, డబ్బుకోసం మానవ ప్రాణాలను గడ్డిపోచకంటే హీనంగా చూసిన నేర పూరిత అలసత్వం ఈ నలుగురికి అమాయకులను రక్తపు మడుగులో పడేసిందన్న విమర్శలు ప్రస్తుతం వెల్లువెత్తుతున్నాయి. ఇది ప్రమాదం కాదు. వ్యవస్థ చేసిన హత్యాయత్నమని పలువురు పేర్కొంటున్నారు. ప్రయాణికుల బస్సు ల్లో ప్రమాదకర పేలుడు పదార్ధాలు తరలించరాదన్నది కఠిన నిబంధన. కానీ ఆర్టీసీ కార్గో సిబ్బందికి ఆ నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి. కాసుల మీద ఉన్న యావ ప్రయాణీకుల ప్రాణాలపై లేకపోయింది. విజయనగరంలో రవీంద్ర అనే వ్యక్తి రోజూ 20 పార్సిల్‌ వరకు పంపుతాడని, తమకు తెలిసిన వ్యక్తే అని సిబ్బంది చెప్పడమే వారి నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఫ్యాన్సీ సామగ్రి అంటే చెబితే చాలు, అందులో ప్రాణాలు తీసే బాంబులున్నాయా, మరేదైనా ఉందా అని చూసే తీరిక, బాద్యత వారికి లేకపోయింది. 25 కిలోల బరువున్న పేలుడు పదార్థాలను నిఘా వ్యవస్థ ఎలా గాలికొదిలేసింది? ప్రయాణికుల ప్రాణాలంటే ఇంత చులకనా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

క్షణం తేడా జరిగితే ఊహకే అందని ప్రమాదం

ప్రమాదం జరిగిన రోజు ఆదివారం మధ్యాహ్నం 12.55 గంటల సమయంలో కాంప్లెక్స్‌ రద్దీగా ఉంది. ఆ పార్సిల్‌ను బస్సు దిగిన క్షణాల్లోనే కిందను పెట్టే క్రమంలో పేలింది. విజయనగరం నుంచి పార్వతీపురం వరకు పలువురు ప్రయాణికులతో ఆ బస్సు దాదాపు రెండు గంటలకు పైగా ప్రయాణించింది. దారిలో ఎన్నో కుదుపులు. ఆ కుదుపులకు ఈ పార్సిల్‌ అటూ, ఇటూ కదిలి బస్సులోనే పేలి ఉంటే ఆ మృత్యుఘోష ఊహించడానికే గుండె తరుక్కుపోతుంది. కేవలం అదృష్టం మాత్రమే ఆ పెను విపత్తును ఆపింది. కానీ ఆ అదృష్టం శ్రామికులను కనికరించలేదు.

కార్గో అధికారుల నిర్లక్ష్యం..

రవీంద్ర ఈ సారి కూడా ఫ్యాన్సీ సామగ్రి పేరుతో పార్సిల్‌ బుక్‌చేశాడని, అందుకే అనుమానం కలగలేదని కార్గో అధికారి డీఎస్‌ఎస్‌ ఎన్‌.రాజు చెప్పారు. అయితే ఫ్యాన్సీ సామగ్రి పేరిట పేలుడు పదార్థాలను అనుమతించడం ఆర్టీసీ వ్యవస్థలోని లోపాలను, సిబ్బంది నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపింది. పేలుడు పదార్థాలు విజయనగరంలో తయారు చేసినవిగా పోలీసులు భావిస్తున్నారు. పేలుడు స్థలం వద్ద లభించిన రాళ్లు దీపావళి గోడ టపాసులకు భిన్నంగా, పరిమాణంలో పెద్దవిగా ఉన్నాయి. ఇవి నాటు బాంబుల తయారీకి వాడే రాళ్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నాటు బాంబుల తయారీదారు స్థావ రం విజయనగరం సమీపంలోని కొండకరకాం అని తేలింది. నిత్యం సరుకు పంపిణీ చేసే బుకింగ్‌దారుడు రవీంద్ర ఈ ఆర్టీసీ కార్గో సర్వీసు ద్వారా గతంలోనూ పలు ప్రాంతాలకు పేలుడు పదార్థాలను సరఫరా చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్టు సమాచారం. ఈ క్రమంలో పార్వతీపురంలో పేలుడు జరిగిన వెంటనే చీపురుపల్లి సమీపంలో పోలీసులు మరో అనుమానాస్పద పార్సిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఆదుకోవాలి

పేలుడు ఘటనకు ఆర్టీసీ కార్గో అధికారుల నిర్లక్ష్యమే కారణమని, బాధితులను కార్గో సర్వీసు యాజమాన్యం ఆదుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. పార్వతీపురం కలెక్టరేట్‌ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ఆర్టీసీ హమాలీలతో కలిసి మంగళవారం ఆందోళన చేశారు. అనంతరం కలెక్టర్‌ డా.ఎన్‌. ప్రభాకరరెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు.

వ్యవస్థాగత లోపంతో నిద్రపోతున్న నిఘా

బస్సులో పేలివుంటే ఊహకే అందని ఘోరం

దర్యాప్తులో నాటుబాంబుల కోణం!

ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్సపొందుతున్న రెడ్డి రమేష్‌(హమాలీ) పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు దాటికి ఆయన అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రెండు కళ్లు, ఎడమ కాలు జీవితాంతం నష్టపోయే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారంటూ కుటుంబ సభ్యులు గగ్గోలు పెడుతున్నారు. కొన్నేళ్ల కిందట భార్యను కోల్పోయిన రమేష్‌ తన చెల్లి సాయంతో హమాలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

కింతలి రమేష్‌(వ్యాన్‌ డ్రైవర్‌)కు పలు శస్త్రచికిత్సలు చేసి శరీరం నుంచి పేలుడు సమయంలో లోపలకు చొచ్చుకెళ్లిన రాళ్లను బయటకు తీశారు. పలు శస్త్రచికిత్సలు చేయాల్సి ఉందని, దాదాపు రూ.12 లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పడంతో ఇద్దరు ఆడపిల్లలు తండ్రి అయిన ఆయనతో పాటు భార్య, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆయన ప్రస్తుతం విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషిస్తున్న తెర్లి రవి కోలుకోవడానికి నెలల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో కుటుంబం తల్లడిల్లుతోంది. జీవనానికి పెద్ద దిక్కు అయిన రవి పేలుడు ఘటనలో ప్రమాదానికి గురవ్వడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

కాలిన గాయాలతో కుడి కాలుకు తీవ్రగాయాలైన బోనెల సుందరరావు (రిక్షా కార్మికుడు) ప్రస్తుతం పార్వతీపుంర జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రిక్షా తొక్కుతూ జీవనాన్ని సాగిస్తున్న ఈయనకు ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

ఎవరిదీ నిర్లక్ష్యం? 1
1/3

ఎవరిదీ నిర్లక్ష్యం?

ఎవరిదీ నిర్లక్ష్యం? 2
2/3

ఎవరిదీ నిర్లక్ష్యం?

ఎవరిదీ నిర్లక్ష్యం? 3
3/3

ఎవరిదీ నిర్లక్ష్యం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement