
మరువలేనివి
అమరుల త్యాగాలు..
పార్వతీపురం రూరల్: అంతర్గత భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్మృతి స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. సాయుధ బలగాల సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ. ధర్మాన్ని కాపాడే క్రమంలో పోలీసులు ప్రాణాలు పణంగా పెడుతున్నారని కొనియాడారు. ఏఎస్పీ అంకిత సురానా విధి నిర్వహణలో అసువులు బాసిన 191 మంది అమరవీరుల పేర్లను చదివి వినిపించారు. అనంతరం అమరవీరుల కుటుంబసభ్యులను అధికారులు పరామర్శించి, పండ్లు, నగదు అందజేసి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే విజయచంద్ర డీఎస్పీలు, సీఐలు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం
విజయనగరం క్రైమ్: పోలీస్ అమరవీరుల త్యాగా లు అజరామరం. వారి జీవితం స్ఫూర్తిదాయకమని ఎస్పీ దామోదర్ కొనియాడరు. ఈ మేరకు స్థానిక పోలీస్ బ్యారెక్స్ లోని ‘స్మృతి వనం‘లో మంగళవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ దేశంలో మావోయిజం తీవ్రంగా ఉన్న సమయంలో దేశ అంతర్గత భద్రత కోసం, తీవ్రవాద కార్యక్రమాలను అరికట్టేందుకు ఎంతోమంది పోలీ సు అధికారులు, సిబ్బంది తమ ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించారని కొనియాడారు. వివిధ విభాగాల్లో పని చేస్తున్న పోలీసులు, పారా మిలటరీ దళాలు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మా వోయిస్టులు, తీవ్రవాదులు, సంఘవిద్రోహ శక్తులతో వీరోచిత పోరాటం చేసిన కారణంగా తీవ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టి, నేడు మనమందరం స్వేచ్ఛగా, శాంతియుతంగా జీవించే అవకాశం కలిగిందన్నారు. ఈ పోరాటంలో ప్రాణాలను కోల్పోయిన పోలీసు కుటుంబాలకు తమప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని, వారి కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామని చెప్పారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎంతో ధైర్య, సాహసాలతో విధులు నిర్వహించి మావోయిస్టుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయి అమరులైన ముద్దాడ గాంధీ, చిట్టిపంతులు చిరంజీవి, షేక్ ఇస్మాయిల్, బి.శ్రీరాములు, ఎస్.సూర్యనారాయణల త్యాగాల ను స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నామని ఎస్పీ దామోదర్ అన్నారు.అంతకుముందు అమరులైన 191 మంది పోలీసుల వివరాలతో కూడిన పుస్తకాన్ని ఎస్పీ ఆవిష్కరించారు. విధులు నిర్వహిస్తూ, తీవ్రవాదుల దాడుల్లో మృతి చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది పేర్లను అదనపు ఎస్పీ పి.సౌమ్యలత చదివి వినిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన కలెక్టర్ రామ్‌సుందర్ రెడ్డి, జిల్లా ప్రధాన న్యాయ మూర్తి ఎం.బబిత, జిల్లా అదనపు న్యాయమూర్తి మీనాదేవి, పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి, కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కెప్టెన్ ఎస్.ఎస్.శర్మ, స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, రాష్ట్ర తూర్పు కాపు చైర్మన్ పాలవలస యశస్వి, అదనపు ఎస్పీ సౌమ్యలత, ఏఆర్ అదనపు ఎస్పీ జి. నాగేశ్వరరావులు పోలీసు అమర వీరుల స్థూపం వద్ద పుష్పాలను సమర్పించి, ఘనంగా నివాళులు అర్పించారు. రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ఎన్.గోపాల నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు పరేడ్ నిర్వహించగా, పోలీసులు తుపాకుల గాలిలో పేల్చి అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని, విధి నిర్వహణలో అమరులైన పోలీసులను స్మరిస్తూ, రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా చెళ్లపిళ్ల సుజాత వ్యవహరించారు. కార్యక్రమంలో విజయనగరం ఇన్‌చార్జ్ డీఎస్పీ ఆర్.గోవిందరావు, చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు, డీటీసీ డీఎస్పీ ఎం.వీరకుమార్, ఏఆర్ డీఎస్పీ ఈ.కోటి రెడ్డి, ఏఓ శ్రీనివాసరావు, పలువురు సీఐలు, ఆర్‌ఐలు, డీపీఓ పర్యవేక్షకులు టి.రామకృష్ణ, వెంకటలక్ష్మి, పోలీసు అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాసరావు సీఐలు ఆర్వీఆర్‌కే.చౌదరి, శ్రీనివాస్, లక్ష్మణ రావు, ఎస్బీ సీఐలు లీలారావు,అంబేడ్కర్, ఎస్సైలు దుర్గాప్రసాద్, మురళి ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని పోలీసు అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.

మరువలేనివి

మరువలేనివి