
ఉయ్యాలో.. ఉయ్యాలా..
● నేత్రపర్వంగా పైడితల్లి ఉయ్యాల
కంబాల మహోత్సవం
● అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
విజయనగరం టౌన్: భక్త కోటికి సిరులిచ్చే చిన్నారి పైడిమాంబ ఉయ్యాల కంబాల ఉత్సవం మంగళవారం రాత్రి వైభవంగా సాగింది. ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిపారు. చదురుగుడి ఆవరణలో ప్రత్యేకంగా అలంకరించిన ఉయ్యాల చుట్టూ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని మూడుసార్లు ప్రదక్షణ చేశారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు ఉత్సవ విగ్రహాన్ని పట్టుకుని ఊయలలో ఆశీనులై అమ్మవారి ఉయ్యాలకంబాల ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం సిరిమానుతో పాటు తెచ్చిన రాటకు మూడుసార్లు గొడ్డలి ఆనించి ఊయలను తీసివేశారు. దీంతో అమ్మవారి జాతరకు ముగింపు పలికినట్లేనని, వనంగుడి వద్ద బుధవారం నిర్వహించే చండీహోమం పూర్ణాహుతితో జాతర ముగుస్తుందని అర్చకులు తెలిపారు. ఉత్సవం పూర్తయిన తర్వాత అమ్మవారిని మేళతాళాలతో వనంగుడికి తీసుకువెళ్లనున్నారు. అమ్మవారు వనంగుడిలోనే ఆరు నెలల పాటు భక్తులకు దర్శనమిస్తారు. కార్యక్రమానికి ముందు ఆలయ ఇన్‌చార్జి ఈఓ కె.శిరీష మాట్లాడుతూ సెప్టెంబర్ 9న పందిరిరాటతో ప్రారంభమైన నెలరోజుల జాతర మహోత్సవాలు ఈ నెల 22న వనంగుడిలో నిర్వహించే దీక్షా విరమణలతో పూర్తవుతాయని వివరించారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ వై.వి.రమణి, సూపర్‌వైజర్లు రామారావు, పెనుమత్స శ్రీనివాసరాజు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

ఉయ్యాలో.. ఉయ్యాలా..