
ఎన్నాళ్లీ డోలీమోతలు?
కురుపాం: కురుపాం మండలంలోని నీలకంఠాపురం పంచాయతీ మహేంద్రపురం గ్రామానికి చెందిన కొండ గొర్రె తుని అనే వృద్ధురాలు సోమవారం జ్వరంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు గ్రామానికి వాహనాలు వచ్చే మార్గం లేకపోవడంతో కుటుంబ సభ్యులు డోలీలో సుమారు కిలోమీటరు దూరంలోని ధర్మలక్ష్మీపురం వరకు మోసుకొచ్చారు. మధ్యలో గెడ్డను డోలీలో తరలించేందుకు అష్టకష్టాలు పడ్డారు. అనంతరం సీతంపేటలోని ఓ ప్రైవేటు క్లినిక్‌కు ప్రైవేటు వాహనంలో తరలించారు. ఈ దృశ్యాలను చూసిన ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యుడు కొండగొర్రె భాస్కరరావు మాట్లాడుతూ ఎన్నాళ్లీ డోలీకష్టాలని ప్రశ్నించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ చంద్ర మండలానికి రాకెట్లు పంపిస్తున్న యుగంలో గిరిజనులకు మాత్రం సొంత గ్రామానికి వెళ్లేందుకు సరైన రోడ్డు సౌకర్యం, వంతెనలు లేకపోవడం బాధాకరమన్నారు. జిల్లాకు చెందిన వ్యక్తి గిరిజన మంత్రిగా కొనసాగుతున్నా గిరిజనుల సమస్యలు మాత్రం తీరడం లేదని వాపోయారు.
గిరిజనుల ప్రాణాలకు రక్షణ లేదా..?
నేతలు మారినా తమ తలరాతలు మారలేదంటున్న గిరిజనం
అనారోగ్యానికి గురైన వ్యక్తిని డోలీలో తరలింపు