గుంటూరు వెస్ట్: రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ ఎత్తివేయాలని హైకోర్టు న్యాయవాది, సామాజిక న్యాయ కేంద్రం తరఫున వై.కోటేశ్వరరావు (వైకె) ఏపీ బీసీ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వానికి సమర్పించే నివేదికలో రాజ్యాంగ సవరణ ద్వారా 50శాతం సీలింగుని రద్దు చేయించవలసిందిగా తమ నివేదిక ద్వారా సిఫారు చేయవలసిందిగా కమిషన్‌ని కోరారు. అలాగే, రాజ్యాంగ సవరణ చట్టాన్ని పరిరక్షించే విధంగా, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఆ చట్టాన్ని చేర్చాలని కూడా సూచించారు. బీసీ రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న విధంగా జనాభా దామాషా ప్రకారం కల్పించాలన్నారు. స్థానిక సంస్థల్లో కల్పించే బీసీ రిజర్వేషన్లను అన్ని కులాలకు అందే విధంగా, ఏబీసీడీఈలుగా వర్గీకరించాలని కోరారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నందున కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, 50 శాతం సీలింగుని ఎత్తివేయించే విధంగా ఒత్తిడి తేవాలన్నారు. వినతి పత్రం సమర్పించిన వారిలో బీసీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పి.వి. రమణయ్య, బీసీ మహాజనసభ రాష్ట్ర అధ్యక్షుడు ఉగ్గం సాంబశివరావు, వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు ఓర్సు ప్రేమ రాజు, శాలివాహన సంఘం రాష్ట్ర నాయకురాలు నాగేశ్వరి, హైకోర్టు న్యాయవాది రాచర్ల కాంత్ ఉన్నారు.


