● జీజీహెచ్‌లో అడ్డగోలుగా
పలువురు వ్యాపారుల తీరు
● అద్దెలు చెల్లించక, కరెంట్
బిల్లులు కట్టక ఖజానాకు గండి
● ప్రజాప్రతినిధుల అండకు తోడు
అధికారుల మద్దతే కారణం
గుంటూరు జీజీహెచ్‌లో కొందరు అడ్డగోలుగా వ్యాపారం చేసుకుంటున్నారు. ఆస్పత్రి ఆవరణలో దుకాణానికి నెలవారీ అద్దె చెల్లించాల్సిన పనిలేకుండా.. కరెంటు బిల్లులు కూడా కట్టనవసరం లేకుండా ఈ వ్యవహారం సాగుతోంది. ప్రజాప్రతినిధుల మద్దతు, ఆస్పత్రి పరిపాలన అధికారులను ప్రసన్నం చేసుకుని ఇలా పలువురు ఆర్జిస్తున్నారు.
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో పాలు, పాల ఉత్పత్తుల షాపులు , ఫొటో స్టాట్ షాపు, టీ స్టాళ్లు, జనరిక్ మందుల షాపులు ఉన్నాయి. వీరు జిల్లా కలెక్టర్ అనుమతితో వ్యాపారాలు చేస్తున్నారు. కొంత మందికి అనుమతులు లేవని ఇటీవల జిల్లా కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందింది. నామినల్‌గా జిల్లాలో ఎక్కడా లేని విధంగా అతి తక్కువ అద్దెతో జీజీహెచ్‌లో వ్యాపారాలు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రతి నెల అద్దె ఇవ్వడం లేదు. కరెంటు బిల్లులు సైతం చెల్లించడం లేదు. ఆసుపత్రి అధికారులు కూడా ఏళ్ల తరబడి ఇలా చేస్తున్న వ్యాపారులపై కనీస చర్యలు తీసుకోకపోవడం లేదు.
హెచ్‌డీఎస్ ఆదాయానికి గండి
ఆస్పత్రికి ఆదాయం వచ్చేలా పనిచేయాల్సిన పరిపాలన అధికారులు వ్యాపారులకు వత్తాసు పలుకుతున్నారు. సొంతంగా లబ్ధి పొంతుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రి అభివృద్ధి సంఘం (హెచ్‌డీఎస్) చైర్మన్‌గా జిల్లా కలెక్టర్, పలువురు ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు ఉన్నారు. ప్రతినెలా, లేదా మూడు నెలలకొకసారి హెచ్‌డీఎస్ సమావేశాలు నిర్వహించి. ఆసుపత్రి అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. కనీసం అలాంటి సమావేశాల్లోనైనా ఈ మొండి బకాయిల గురించి అజెండాలో పెట్టకుండా, చర్చించకుండా వ్యాపారస్తులకు వత్తాసు పలుకుతున్నారు. ఆసుపత్రిలో నిధుల కొరతతో హెచ్‌డీఎస్ అకౌంట్ ఎన్నడూ లేని విధంగా అల్లాడుతోంది. ఆసుపత్రిలో వ్యాపారాలు చేసేవారి వద్ద నుంచి సకాలంలో నిధులు సేకరించడం ద్వారా హెచ్‌డీఎస్ అకౌంట్‌కు నిధులు సమకూరుతాయి. జిల్లా కలెక్టర్ దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


