పిడుగురాళ్ల: సర్వర్ పనిచేయక పిడుగురాళ్లలో పింఛన్ లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక పక్క సర్వర్ పనిచేయక, మరోపక్క ఉక్క పోతతో ఓపిక నశించిన పింఛన్ లబ్ధిదారులు ఇక లాభం లేక వెనుదిరిగారు. అధికారులు సర్వర్‌తో కుస్తీ పట్టడమే సరిపోయింది. సోమవారం ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీ ప్రారంభం కాగా, సర్వర్ సమస్యతో కొద్దిమందికి మాత్రమే సచివాలయ సిబ్బంది ఇవ్వగలిగారు. అక్కడ నుంచి సర్వర్ మోరాయించి, సాయంత్రం నాలుగు గంటల వరకు రాకపోటంతో పెన్షన్ దారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
అందరూ ఒక్కచోటకి వస్తేనే పింఛన్..
ముప్పాళ్ల: సామాజిక పింఛన్ల కోసం లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వలంటీర్లు ఇంటింటికి తిరిగి పింఛన్లు అందించగా.. కూటమి ప్రభుత్వంలో ఎక్కడ ఎప్పుడు ఇస్తారో తెలియక వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రమైన ముప్పాళ్ల గ్రామంలోని ఎస్సీ కాలనీలో సోమవారం ఇంటింటికి వచ్చి పింఛన్లు అందించాల్సిన ఐకేసీ సీసీ నాగరాజు లబ్ధిదారులందరిని చర్చి వద్దకు వస్తేనే ఇస్తానని చెప్పటంపై వృద్ధులు, దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. వయసుడిగి... కాళ్లు, నడుం నొప్పితో ఇబ్బందుల పడుతున్న తమను మరింత ఇబ్బందులకు గురిచేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ప్రతి నెలా ఇంటి వద్దనే పింఛన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా, ముప్పాళ్లలో చోటుచేసుకున్న పింఛన్ పంపిణీ వ్యవహారం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దాన్ని కవర్ చేసుకునేందుకు అధికారులు పాట్లు పడ్డారు.


