చికిత్సకని వెళుతూ తిరిగిరాని లోకాలకు.. | - | Sakshi
Sakshi News home page

చికిత్సకని వెళుతూ తిరిగిరాని లోకాలకు..

Jun 2 2026 3:06 AM | Updated on Jun 2 2026 3:06 AM

● రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి ● మరొకరి పరిస్థితి విషమం

వెల్దుర్తి: మంగళగిరిలోని ఎయిమ్స్‌ వైద్యశాలలో చికిత్స చేయించుకునేందుకు వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఇద్దరు మృతిచెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్న ఘటన జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. మండలంలోని రచ్చమల్లపాడు గ్రామానికి చెందిన రెంటాల ఆదిలక్ష్మమ్మ (60)కు మోకాళ్ల నొప్పులు అధికం కావడంతో కొడుకు పాలంకయ్యతో కలిసి మంగళగిరిలోని ఎయిమ్స్‌ వైద్యశాలకు బయల్దేరింది. వీరిని మాచర్లలో గుంటూరు వెళ్లే ఫస్టు బస్సు ఎక్కించేందుకు ఆదిలక్ష్మమ్మ కుమార్తె కుమారుడు (మనవడు) ఐతంరాజు మారుతి(18) తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని మాచర్ల బస్టాండ్‌కు బయలుదేరాడు. ఈక్రమంలో సోమవారం తెల్లవారుఝామున 3.30గంటలకు వస్తున్న సమయంలో మాచర్ల నుంచి యర్రగొండపాలెం వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం మాచర్ల – శ్రీశైలం జాతీయ రహదారిలోని మండాది బోడు వద్ద బలంగా ఢీ కొట్టడంతో బండి పై ప్రయాణిస్తున్న వారు ఎగిరి రోడ్డు పక్కన పడ్డారు. ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం సుమారు 60 అడుగుల దూరం లాక్కెల్లింది. ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న రెంటాల ఆదిలక్ష్మమ్మ, ఐతంరాజు మారుతిలు అక్కడికక్కడే మృతిచెందారు. రెంటాల పాలంకయ్య తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లాడు. మండాది నుంచి మాచర్లకు వస్తున్న వారు గమనించి క్షతగాత్రుడు పాలంకయ్య మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పాలంకయ్యకు ప్రథమ చికిత్స చేయగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం నర్సరావుపేటకు తరలించారు. మారుతి తండ్రి అంజి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

శోకసంద్రంలో రచ్చమల్లపాడు

ఒకే కుటుంబంలోని వారు ఇద్దరు మృతిచెంది, ఒకరు తీవ్రగాయాల పాలై కోమాలోకి వెళ్లడంపై రచ్చమల్లపాడు గ్రామం శోకసంద్రంలో మునిగింది. విషయం తెలుసుకున్న బంధువులు, ఆత్మీయులు, గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వెళ్లి వస్తామని చెప్పి కానరాని లోకాలకు వెళ్లారయ్యా అంటూ బంధువులు రోదిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement