భవితకు బాసట | - | Sakshi
Sakshi News home page

భవితకు బాసట

Jun 1 2026 3:55 AM | Updated on Jun 1 2026 3:55 AM

భవితకు బాసట ● పాఠశాలకు రాలేని విద్యార్థుల ఇంటి వద్దకే వెళ్లి ఐఈఆర్టీ ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణ అందిస్తారు. ● చదువు, క్రీడల్లో రాణించే విద్యార్థులకు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు కల్పించి ప్రోత్సాహకాలు అందిస్తారు. అవసరమైన వారికి ఉచితంగా ట్యాబ్‌లు అందిస్తున్నారు. ● ప్రతినెల విద్యార్థికి రూ.300 చొప్పున రవాణా భత్యాన్ని తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తారు. ఎస్కార్ట్‌ అలవెన్స్‌ కింద ఏటా రూ. 3 వేలు చొప్పున జమ చేస్తారు. బాలికలకు అదనంగా ఉపకార వేతనం కింద ఏటా రూ. 2 వేలు అందిస్తారు. 9,10 తరగతి విద్యార్థులకు జాతీయ ఉపకార వేతనం కింద అదనంగా ఏటా రూ. 9 వేల నుంచి రూ.12 వేల వరకు అందజేస్తారు. సర్వేకు సహకరించాలి

జిల్లాలో ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తిస్తున్న అధికారులు ఈనెల 10 వరకు జరగనున్న సర్వే 820 మంది ప్రత్యేక అవసరాల పిల్లలు సర్వేలో 60 మంది గుర్తింపు

దృష్టి యాప్‌తో గుర్తింపు..

సత్తెనపల్లి: ప్రత్యేక అవసరాల చిన్నారుల ఆరోగ్యం, జీవన ప్రమాణాల మెరుగుకు ‘భవిత కేంద్రాలు’ ఆసరాగా నిలుస్తున్నాయి. బడులకు దూరంగా ఉన్న 3–18 సంవత్సరాల వయస్సున్న ప్రత్యేక అవసరాల చిన్నారుల గుర్తింపునకు ఈ నెల 1న ప్రారంభమై ప్రస్తుతం కొనసాగుతున్న సర్వే ఈనెల 10వ తేదీ నాటికి పూర్తి కానుంది. ఐఈఆర్టీ అధికారులు ప్రత్యేక అవసరాల చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులను నూతనంగా గుర్తించి పాఠశాలలో పునఃప్రారంభమైన తర్వాత సమీప భవిత కేంద్రాలు, పాఠశాలల్లో చేర్పించనున్నారు.

భవిత కేంద్రాల్లో అందించే సేవలు..

జిల్లాలో 28 భవిత కేంద్రాలు ఉండగా, వాటిలో గత విద్యా సంవత్సరం 820 మంది విద్యార్థులు లబ్ది పొందారు. వీరిలో 280 మంది విద్యార్థులు ఇంటి వద్ద మంచాలకే పరిమితమై ఉండగా, మిగిలిన 540 మంది భవిత కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. వీరికి ప్రభుత్వంతోపాటు అలింకో అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా అవసరమైన పరికరాలను అందిస్తున్నారు.రాయడం, మాట్లాడటం, చదవడంలో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. జిల్లాలో మూడు మండలాలకు ఒక ఫిజియోథెరపిస్టు చొప్పున 8 మంది ఉన్నారు. వీరు వారంలో ఒకరోజు భవిత కేంద్రాల్లో వైద్యులు, తల్లిదండ్రుల పర్యవేక్షణలో చిన్నారులకు చిన్నపాటి వ్యాయామాల ద్వారా ప్రత్యేక శిక్షణ అందించి వారిలో సానుకూల ధృక్పథాన్ని పెంపొంది స్తున్నారు.

డీఈఓ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రతి మండలంలో ఉన్న ఐఈఆర్టీల ద్వారా నూతనంగా ప్రత్యేక అవసరాల విద్యార్థుల గుర్తింపు సర్వేను వేగవంతం చేశాం. ఇప్పటివరకు జిల్లాలో 60 మంది ప్రత్యేక అవసరాల చిన్నారులను గుర్తించాం. ప్రత్యేక అవసరాల చిన్నారులకు 21 రకాల పరీక్షలు చేసి ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నాం. ఆయా స్థాయిలను బట్టి వారిని సమీప భవిత కేంద్రాలు, సమీప పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు చేపడుతున్నాం.

–ఆర్‌.సెల్వరాజ్‌, సహిత విద్యా జిల్లా సమన్వయకర్త, పల్నాడు

ఐఈఆర్టీ ఉపాధ్యాయులు సుమారు నెలరోజుల పాటు గ్రామాల్లో తిరిగి ప్రజల నుంచి వివరాలు సేకరించి దృష్టి యాప్‌లో నమోదు చేస్తున్నారు. జిల్లాలో ఈ నెల ఒకటి నుంచి ప్రారంభమైన సర్వేలో ఇప్పటి వరకు 60 మంది ప్రత్యేక అవసరాల చిన్నారులను గుర్తించారు. వీరు చేస్తున్న సర్వేను మండల విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

జిల్లాలో భవిత కేంద్రాలు : 28

ప్రత్యేక అవసరాల చిన్నారులు : 820 మంది

భవిత కేంద్రాలకు వచ్చేవారు : 540

ఇంటివద్ద చదివే పిల్లలు : 280

కొత్తగా సర్వేలో గుర్తించిన వారు : 60

మొత్తం ఐఈఆర్టీలు : 56

ఫిజియోథెరపిస్టులు : 8

Advertisement
 
Advertisement
Advertisement