నరసరావుపేట ఈస్ట్: జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో మండలంలోని గురవాయిపాలెం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ నాగరవీంద్ర బంగారు పతకం సాధించాడు. పంజాబ్ రాష్ట్రం ఆధ్వర్యంలో జమ్మూ, కశ్మీర్‌లో నిర్వహించిన 6వ యూత్ స్పోర్ట్స్ ప్రమోషన్ అసోసియేషన్ (వైఎస్‌పిఏ) నిర్వహించిన నేషనల్ చాంపియన్‌షిప్ పోటీల్లో 200 మీటర్ల పరుగు పందెంలో 23.04 సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకొని నాగరవీంద్ర బంగారు పతకం సాధించాడు. రవీంద్ర గతంలోనూ 2025 జూలైలో నేపాల్‌లో నిర్వహించిన 5 దేశాల అంతర్జాతీయ చాంపియన్‌షిప్ పోటీలో రాణించి 200 మీటర్లలో గోల్డ్ మెడల్ సాధించాడు. రవీంద్ర ఇప్పటికే పలు జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాడు. రవీంద్ర మాట్లాడుతూ పోటీల్లో పాల్గొనేందుకు శిక్షణ ఇస్తున్న కోచ్ నెల్లూరుకు చెందిన ప్రవీణ్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనను ఆర్థికంగా ఆదుకుంటూ ప్రోత్సహిస్తున్న బంధువులు, స్నేహితులు, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి ప్రోత్సాహంతో 2028లో జరగనున్న ఒలంపిక్స్‌లో భారత్ తరపున పాల్గొని 200 మీటర్లు పరుగు పందెంలో బంగారు పతకం సాధించగలనని ధీమా వ్యక్తం చేశారు.
గుంటూరువెస్ట్(క్రీడలు): నైట్ క్యాజిల్స్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన అండర్–15 బాలబాలికల చెస్ పోటీలు విజయవంతంగా ముగిశాయని పోటీల నిర్వాహకుడు వైవీకే చక్రవర్తి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాలుర విజేతలుగా పునీత్, శ్రీ లక్ష్మీ కార్తికేయ, చేతన్ ముక్కపాటి, మర్రెడ్డి తేజ్ భరత్‌రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి కట్టెపోగు నిలిచారన్నారు. బాలికల విభాగంలో తేజ అనూష తన్నీరు, జయ అహల్య తన్నీరు, ధార్మిక నూతి, కావ్య ఏఎన్‌ఎస్‌ఎస్ లు నిలిచారన్నారు. విజేతలకు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు సీహెచ్ రవీంద్ర రాజు, సీనియర్ కోచ్ మురళీకృష్ణ, వై.హరిహరరాయులు, ఇంటర్నేషనల్ మాస్టర్ బాలచంద్ర ప్రసాద్‌లు బహుమతులు ప్రదానం చేశారన్నారు. పోటీల్లో మొత్తం 120 మంది చిన్నారులు పాల్గొన్నారని తెలిపారు.
ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ
తాడేపల్లి రూరల్: యువత మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ఏపీ ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ స్పష్టం చేశారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని బ్రహ్మానందపురంలో నిర్వహిస్తున్న ఫ్యాక్టరీ ప్రీమియర్ లీగ్ సీజన్–2 క్రికెట్ టోర్నమెంట్‌లో 50 జట్లు తలపడగా ఆదివారం సులోచన, మొబిన్ సీసీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ యువతలో ఆరోగ్యకరమైన జీవని శైలిని ప్రోత్సహించే లక్ష్యంతో డ్రగ్స్ వద్దు బ్రో నినాదాన్ని తీసుకువచ్చారని, అదే స్ఫూర్తితో ఈగల్ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ ఆడు బ్రో కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. ప్రతి యువకుడు కనీసం రెండు క్రీడలను అలవాటు చేసుకోవాలని సూచించారు. మొబైల్‌ఫోన్లు, ఇంటర్‌నెట్‌లో గడపడం వల్ల శారీరక ధారుడ్యం తగ్గిపోతుందని, ఆరోగ్య సమస్యలు పెరుగుతాయని వివరించారు. గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే ఏపీ ఈగల్ టోల్‌ఫ్రీ నెంబర్ 1972కు సమాచారం అందజేయాలని కోరారు. అనంతరం గెలుపొందిన మొబిన్ సీసీ జట్టుకు కప్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఈగల్ ఎస్పీ నగేష్‌బాబు, డీఎస్పీ శాంతరాజ్, ధనంజయ, వెంకటరావు, పెంచలయ్య, వినోద్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.


