రైతుల నోట్లో ‘మట్టి’ | - | Sakshi
Sakshi News home page

రైతుల నోట్లో ‘మట్టి’

Jun 1 2026 3:55 AM | Updated on Jun 1 2026 3:55 AM

వయ్యకల్లులో బరితెగించిన ఇసుక, మట్టి మాఫియా పడమటి వాగులో యథేచ్ఛగా అక్రమ రవాణా అధికార పార్టీ నేత అండతోనే మైనింగ్‌ గ్రామస్తులు, రైతులను బెదిరిస్తూ అక్రమ నిల్వలు వరద ముంపు భయంలో రైతాంగం

శావల్యాపురం: శావల్యాపురం మండలం వయ్యకల్లు గ్రామంలో మట్టి, ఇసుక మాఫియా పడమటి వాగును పిండేస్తోంది. అధికార పార్టీ ముఖ్యనేతల అండదండలతో కొందరు నేతలు యథేచ్ఛగా ఇసుక అక్రమ దందాకు తెరలేపారు. గ్రామ మాజీ సర్పంచ్‌ కుమారుడు, మండల స్థాయి అధికార పార్టీ నేత ఒకరు ఈ అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తూ, ఇసుక, మట్టిని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్తులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.

ఇసుక దోపిడీకే బ్రిడ్జి నిర్మాణం!

ఇటీవల కాలంలో ప్రభుత్వం సుమారు రూ. 50 లక్షలతో పడమటి వాగుపై ఒక బ్రిడ్జిని నిర్మించింది. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయినప్పటి నుంచే సదరు నేత కన్ను ఇక్కడి ఇసుక నిల్వలపై పడింది. బ్రిడ్జి నిర్మాణాన్ని ఆసరాగా చేసుకుని, ఆఘమేఘాల మీద పొక్లెయిన్లను రంగంలోకి దించారు. చుట్టుపక్కల రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, నిబంధనలకు విరుద్ధంగా వాగు అంచుల్లో భారీగా తవ్వకాలు జరుపుతూ ఇసుకను తరలిస్తున్నారు.

కన్నెత్తి చూడని అధికారులు

ఇంత బహిరంగంగా పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుక దోపిడీ జరుగుతున్నా సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు అధికార పార్టీ నేత అధికారులను మభ్యపెట్టారా, లేక తన రాజకీయ బలంతో భయపెట్టారా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.

పొంచి ఉన్న భారీ ముంపు

పడమటి వాగు అంచున ఉన్న పొలాలకు ఈ అక్రమ తవ్వకాల వల్ల భారీ వరద ముప్పు పొంచి ఉంది. గతంలో పలుమార్లు ఈ వాగు పొంగిపొర్లడం వల్ల చుట్టుపక్కల రైతులు తీవ్రంగా పంట నష్టపోయారు. ఇప్పుడు వాగు అంచులను ఇష్టారాజ్యంగా తవ్వేస్తుండటంతో, రాబోయే వర్షాకాలంలో వాగు గట్టు తెగి పొలాలు పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రశ్నిస్తే ఎదురుదాడి.. దౌర్జన్యం

‘ఇలా అక్రమంగా తవ్వడం వల్ల మా పొలాలు మునిగిపోతాయి, ఇది పద్ధతి కాదు’ అని ప్రశ్నించిన రైతులపై సదరు నేత దౌర్జన్యానికి దిగుతున్నాడు. తమను నానా దుర్భాషలాడుతూ బెదిరింపులకు గురిచేస్తున్నాడని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆదివారం సాయంత్రం వరకు కూడా ఇక్కడ యథేచ్ఛగా పొక్లెయిన్లతో తవ్వకాలు సాగాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, అక్రమ మైనింగ్‌పై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ముంపు ముప్పు నుంచి తమ పొలాలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement