పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అధిక జ్యేష్ఠ పౌర్ణమి నేపథ్యంలో ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ ఆదివారం వైభవంగా సాగింది. తెల్లవారుజామున 5.55 గంటలకు దుర్గగుడి ఘాట్‌రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు, ఈవో దంపతులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత ప్రత్యేకంగా అలంకరించిన పూల వాహనాన్ని ఆదిదంపతులు అధిరోహించగా, ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. ఆదిదంపతులతో పాటు దేవస్థాన ప్రచార రథం ముందుకు సాగగా మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాల మధ్య గిరిప్రదక్షిణ కనుల పండువగా సాగింది. ఓకే నెలలో రెండు పర్యాయాలు గిరి ప్రదక్షిణ జరగడం విశేషం. మే 1వ తేదీ వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకొని గిరి ప్రదక్షిణ జరగగా, మే 31వ తేదీ అధిఖ జ్యేష్ఠ పౌర్ణమి రావడంతో మరోమారు ఆదివారం గిరిప్రదక్షిణ జరగింది.
ప్రదక్షిణ ఇలా..
దుర్గగుడి నుంచి ప్రారంభమైన గిరిప్రదక్షిణ ఊరేగింపు కుమ్మరిపాలెం, విద్యాధరపురం, సితారా, కబేళా, పాల ప్రాజెక్టు, కేఎల్‌రావునగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, బ్రహ్మణ వీధి మీదగా ఆలయానికి చేరుకుంది. పెద్ద ఎత్తున భక్తులు, ఉభయదాతలు, సేవా సిబ్బంది, ఆలయ అధికారులు, సిబ్బంది కుటుంబ సమేతంగా గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. తమ ఇంటి ముంగిటకు విచ్చేసిన ఆది దంపతులకు భక్తులు పూజా సామగ్రి సమర్పించి ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు దేవస్థానం కుంకుమతో పాటు పులిహోర ప్రసాదాలను పంపిణీ చేసింది.


