బాపట్లటౌన్: మహిళల భద్రతే ‘ఆపరేషన్ దండాయన’ లక్ష్యమని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఆపరేషన్ దండాయన పోస్టర్ ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ మహిళలు, బాలికల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ, మహిళలపై జరుగుతున్న నేరాల నియంత్రణకు, నేరస్తులకు త్వరితగతిన శిక్షలు పడేలా బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ చేపట్టిన ‘ఆపరేషన్ దండాయన’ కార్యక్రమాన్ని బాపట్ల జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. అత్యాచారాలు, గృహహింస, పోక్సో కేసులు, మహిళలపై వేధింపులు వంటి నేరాల్లో నిందితులకు వేగంగా శిక్షలు పడేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. మహిళల భద్రత కోసం అమలు చేస్తున్న ‘స్పీడ్ ట్రయల్ మానిటరింగ్’ విధానం ద్వారా కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నేరస్తులపై చట్టపరమైన చర్యలను మరింత కఠినంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహిళలకు సంబంధించిన ప్రతి కేసులో సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేసి, 60 రోజుల్లోపు చార్జిషీట్లు దాఖలు చేసి, కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేసి నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బాధిత మహిళలకు అవసరమైన కౌన్సెలింగ్, న్యాయ సహాయం అందించడంతో పాటు నేరస్తులు, అనుమానితులపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నామన్నారు. వారి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. ప్రజల భాగస్వామ్యంతో నైబర్‌హుడ్ వాచ్ విధానాన్ని అమలు చేస్తూ, జియోట్యాగింగ్ ఆధారంగా నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నామన్నారు. కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్, ఎస్బీ ఇన్‌న్‌స్పెక్టర్ జి.నారాయణ, ఉమెన్ పీఎస్ ఇన్‌స్పెక్టర్ ఎస్.సుబ్బారావు, సీసీఎస్ ఇన్‌న్‌స్పెక్టర్ ప్రేమయ్య, శక్తి టీం సభ్యులు పాల్గొన్నారు.


