సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలు కాగా ఒకరు అస్వస్ధతకు గురైన ఘటన సత్తెనపల్లి మండలం కంటెపూడి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కొండమోడు – పేరేచర్ల రహదారి విస్తరణలో భాగంగా సత్తెనపల్లి మండలం కంటెపూడి సమీపంలో బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గుంటూరు వైపు నుంచి సత్తెనపల్లి వైపుకు బేబీ చిప్స్‌తో వస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల వద్ద వాహనాన్ని నెమ్మదిగా నడుపుతుండగా వెనుక నుంచి 50 మంది ప్రయాణికులతో గుంటూరు స్వర్ణ భారతి నగర్ నుండి మొక్కు తీర్చుకోవడం కోసం దామరచర్ల గ్రామం గండి మైసమ్మ దేవాలయానికి ప్రయాణమైన భక్తుల డీసీఎం లారీ ఢీ కొట్టింది. దీంతో డీసీఎం లారీ వాహనం ముందు క్యాబిన్ ధ్వంసమై క్యాబిన్‌లో కూర్చున్న ఓర్చు వెంకటేశ్వర్లుకు రెండు కాళ్లు విరగ్గా, ఓర్చు యేసురాజుకు కాళ్లకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఓర్చు రమణమ్మకు ఛాతిలో నొప్పి అధికమై అస్వస్థతకు గురైంది. క్షతగాత్రులను సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం కాళ్లు విరిగిన వెంకటేశ్వర్లు, యేసురాజులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఇది ఇలా ఉంటే డీసీఎం లారీ వాహన డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు బాధితులు వాపోయారు. ఇరువాహనాల డ్రైవర్లు పరారయ్యారు. సంఘటనా స్థలాన్ని సత్తెనపల్లి రూరల్ పోలీసులు సందర్శించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇరువురికి తీవ్ర గాయాలు


