తాడేపల్లి రూరల్: మంగళగిరి పట్టణ పరిధి వీవర్స్ కాలనీలోని పీఎంశ్రీ ఎంటీఎంసీ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి హ్యాకథాన్‌లో ప్రతిభ కనబరిచి బెస్ట్ ఇన్నోవేటివ్ థింకింగ్ అవార్డు అందుకున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.వెంకటేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మే 25 నుంచి 29వ తేదీ వరకు విశాఖపట్నంలోని గీతమ్ విశ్వవిద్యాలయంలో అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ కార్యక్రమం, లీడర్ షిప్ ఫర్ ఈక్విటీ సంయుక్తంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. పోటీలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి మొత్తం 23 జట్లు పాల్గొన్నాయని తెలిపారు. తమ స్కూలు విద్యార్థులు ప్రదర్శనలు ప్లాస్టిక్ ఫ్రీ మంగళగిరి, సేవ్ టుడే, సెక్యూర్ టుమారో అనే ప్రాజెక్ట్ న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నట్లు వివరించారు. ప్రాజెక్ట్‌లో రివార్డు ఆధారిత ప్లాస్టిక్ వ్యర్థ నిర్వహణ వ్యవస్థను రూపొందించారని, ప్రజలు ప్లాస్టిక్ వ్యర్ధాలను సక్రమంగా పారవేయడానికి ప్రోత్సహించే విధంగా ఈ వ్యవస్థ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ వ్యవస్థలో ఇచ్చే రివార్డుల స్థితిని పర్యవేక్షించడానికి విద్యార్థులు ఎంఐటి యాప్ ఇన్వెంటర్ ద్వారా ఒక మొబైల్ అప్లికేషన్‌కు అభివృద్ధి చేశారని, ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమకు లభించిన రివార్డులు, ప్లాస్టిక్ వ్యర్థాల సమర్పణ వివరాలను సులభంగా ట్రాక్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కు వృత్తి శిక్షనాధికారి గుమ్మ వెంకట వినీత మార్గదర్శకత్వం వహించారని పేర్కొన్నారు. అవార్డు గెలుచుకున్న విద్యార్థులను అభినందిస్తున్నామని తెలిపారు.


