జిల్లాలో యథేచ్ఛగా గ్యాస్ దందా చూసీచూడనట్లుగా అధికారులు బ్లాక్ మార్కెట్‌లో డొమెస్టిక్ సిలిండర్ల విక్రయాలు వినియోగదారులు బుక్ చేసిన నెల రోజులకూ అందని బండ మరో వైపు వ్యాపారులకు పుష్కలంగా సరఫరా ధరల పెరుగుదలతో అక్రమ వినియోగానికి ఊతం
వాణిజ్య అవసరాలకు ‘గృహ’ సిలిండర్లు
నరసరావుపేట టౌన్: గృహ అవసరాలకు ప్రభుత్వం సరఫరా చేసే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌లు అక్రమంగా వాణిజ్య అవసరాలకు మళ్లుతోంది. పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో అక్రమ గ్యాస్ వినియోగం పట్టణంలో యథేచ్ఛగా కొనసాగుతోంది. పశ్చిమసియా యుద్ధ ప్రభావంతో దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరాలో కొరత ఏర్పడి సామాన్యులు ఒకవైపు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కొంత మంది గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు అక్రమ మార్గంలో గృహ వినియోగ సిలిండర్‌లను బ్లాక్ మార్కెట్‌లో అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరిగాయి. దీంతో పాటు డిమాండ్ పెరగటంతో కట్టెల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఈ క్రమంలో హోటళ్లు, టిఫిన్ సెంటర్‌లు, ఫాస్ట్ ఫుడ్ వ్యాపారాలు తక్కువ ధరలో లభించే గృహ వినియోగ సిలిండర్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో బుక్ చేసిన ఒకటి, రెండు రోజుల్లోనే గ్యాస్ సిలిండర్ సరఫరా అయ్యేది. ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పట్టణ పరిధిలో బుక్ చేసిన తర్వాత నెల రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు సిలిండర్ కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సరిపడా గ్యాస్ అందుబాటులో లేక గృహిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ధర పెరగటంతోనే..
గృహ అవసరాలకు సరఫరా చేసే 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ రూ.950ల వరకు ఉండగా, 19 కేజీల కమర్షియల్ సిలిండర్ రూ.3,200 ఉంది. గృహ సిలిండర్ తక్కువ ధర కారణంగా అక్రమ వ్యాపారులు వాటిని ఉపయోగించేందుకు అనేక మార్గాలను వినియోగిస్తున్నారు. కొంతమంది వినియోగదారుల వద్ద సిలిండర్‌పై రూ.300 నుంచి రూ.500 వరకు అధిక నగదు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. మరి కొందరు గ్యాస్ ఏజెన్సీల్లో పనిచేసే దళారుల ద్వారా కొనుగోలు చేసి వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. యుద్ధ ప్రభావంతో రూ.2,200 ఉన్న కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,200లకు పెరిగింది. ఒకేసారి రూ.వెయ్యి వరకు పెంచటంతో వ్యాపారులు అక్రమ మార్గంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌లను వినియోగిస్తున్నారు. అక్రమార్కులు గృహ అవసరాల సిలిండర్‌లను అధికంగా వినియోగించటంతో కొరత ఏర్పడి ఆ ప్రభావం వినియోగదారులపై పడుతోంది. ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి గ్యాస్ అక్రమ వినియోగ నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


