నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు సిద్ధం

May 31 2026 1:36 AM | Updated on May 31 2026 1:36 AM

● జేఎన్‌టీయూ కళాశాలకు కొత్తగా ఒక్కరూపాయి టెండర్‌ పిలువలేదని, తమ హయాంలో మొదలు పెట్టిన పనులను పూర్తిచేసేందుకే వారికి ఈ రెండేళ్లు పట్టిందన్నారు. తాము జేఎన్‌టీయూ ఏర్పాటుకోసం రూ.150కోట్లకు టెండర్‌ పిలిచి అభివృద్ధి చేశామన్నారు. కేంద్రీయ విద్యాలయాలు మాచర్ల, నరసరావుపేటకు మంజూరుకాగా ఈ ఏడాది నుంచి మాచర్లలో తరగతులు ప్రారంభమయ్యాయన్నారు. నరసరావుపేటలో ఆ విద్యాలయానికి కావాల్సిన ఐదు ఎకరాల స్థలం ఇప్పటికీ చూపించలేకపోయారన్నారు. ఆటోనగర్‌కు కూడా ఇదేవిధంగా ఉప్పలపాడు వద్దనున్న వాగు పోరంబోకు స్థలాన్ని పంపిస్తే సీసీఎల్‌ఏ విభాగం ఆమోదించకుండా తిరిగి వెనక్కు పంపించిందన్నారు. అయితే స్థలం ఎలాట్‌మెంట్‌ జరిగిందని ఆటో యూనియన్‌ నాయకులు, కార్మికులను మభ్యపెడుతు న్నాడన్నారు.

ఎమ్మెల్యే చదలవాడ సవాల్‌ను స్వీకరిస్తున్నా వైఎస్సార్‌ సీపీ హయాంలో నియోజకవర్గంలో రూ.2476కోట్లతో సంక్షేమం, అభివృద్ధి ఈ రెండేళ్లలో ప్రజలకు చదలవాడ చేసింది శూన్యం విలేకర్ల సమావేశంలో స్పష్టం చేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి

నిధులు పెరిగితే అభివృద్ధి ఏదీ?

నరసరావుపేట: నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఆ చర్చ టౌన్‌హాలు లేదా కోటప్పకొండ వేదికగా జరగాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధిపై పట్టణ నడిబొడ్డున ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద చర్చకు రావాలంటూ ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నానని స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నడిరోడ్డుపై అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ట్రాఫిక్‌ సమస్య వలన గంటలతరబడి కూర్చొని చర్చించటం సాధ్యంకాదని, అందువల్ల టౌన్‌హాలులో అంబేడ్కర్‌ చిత్రపటం ఏర్పాటుచేసి మీడియా సమక్షంలో చర్చిద్దామని సూచించారు. అధికారంలో వారు ఉన్నందున తేదీ, సమయం, ఏర్పాట్లు అన్నీ ఎమ్మెల్యేనే చూడాలని కోరారు. చెప్పిన సమయానికి వారు ఎంతమంది వచ్చినా తాను ఒక్కడినే వస్తానని పేర్కొన్నారు.

పేదవాడికి సెంటు ఇచ్చిన పాపాన పోలేదు

ఈ రెండేళ్ల కాలంలో నియోజకవర్గ ప్రజలకు డాక్టర్‌ చదలవాడ చేసింది శూన్యమని డాక్టర్‌ గోపిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్‌ సీపీ హయాంలో నియోజకవర్గ ప్రజలకి రూ.2476కోట్ల విలువైన సంక్షేమం, అభివృద్ధి పనులు తాము అందజేశామని వెల్లడించారు. పల్నాడును జిల్లాగా ఏర్పాటు చేసి, నరసరావుపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించామని, జిల్లా కలెక్టర్‌, ఎస్‌పీ, ఇతర జిల్లా అధికారులు ఇక్కడ ఉంటున్నారంటే మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తనకు ఆ ఘనత దక్కుతుందన్నారు. రెండేళ్ల నుంచి టీడీపీ కార్యాలయంలో ప్రతి శుక్రవారం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి ఏ ఒక్క పేదవాడికై నా ఇంటి స్థలంకోసం సెంటు భూమి ఇచ్చారా అని ప్రశ్నించారు. కేవలం తన అనుయాయుడు, ఇప్పటికే ఇళ్ల స్థలాలు ఉన్న బీసీ కాలనీ రమేష్‌కు సెంటు రూ.25లక్షలు విలువచేసే నాలుగు సెంట్ల మున్సిపల్‌ స్థలాన్ని మాత్రమే ఇచ్చాడని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో సుమారు 15వేలమందికి ఇళ్లపట్టాలు ఇచ్చామని, జగనన్న కాలనీల్లో సెంటు స్థలం, గ్రామాల్లో సెంటున్నర చొప్పున ఇచ్చామన్నారు.

కోటప్పకొండకు నిధులు పెంచామని ఎమ్మెల్యే చదలవాడ చెబుతున్న మాటల్లో ఎటువంటి వాస్తవంలేదన్నారు. ఈ రెండేళ్లలో రూ.4కోట్ల నిధులు పెరిగితే 15 మరుగుదొడ్ల నిర్మాణం తప్పితే మరెటువంటి అభివృద్ధి ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. కాకాని, చింతలపాలెం గ్రామాలకు చెందిన ఇద్దరికి కోటప్పకొండ అజమాయిషీ అప్పచెప్పటంతో వారు కొండ నిధులను స్వాహా చేస్తున్నారన్నారు. తాము కోటప్పకొండపైన నంది, మేథా దక్షిణామూర్తి విగ్రహాలు, అతిధిగృహాలు, మెట్లపై షెడ్లు, దేవాలయం చుట్టూ ఉన్న గిరిప్రదక్షణ రోడ్డు, సెంట్రల్‌ డివైడర్‌, లైటింగ్‌, కూడలిలో శివుని బొమ్మ ఏర్పాటు చేశామన్నారు. ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు ఒకరు 90శాతం హామీలు నెరవేర్చామని మాట్లాడుతున్నాడని, అవి ఏంటో చర్చించేందుకు రావాలని పిలుపు ఇచ్చారు. రెండు చప్టాలు కట్టి రెండు ప్లైఓవర్‌లు కట్టినట్లుగా ప్రచారం చేసుకుంటున్నాడన్నారు. తాము చేసిన అభివృద్ధి, అందజేసిన సంక్షేమం లెక్కలతో తాను చర్చించేందుకు వస్తానని, దమ్ము, దైర్యం ఉండి వారు వస్తే చర్చించి తేల్చుకుంటామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement