డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ సందర్శన
యడ్లపాడు: నదుల ప్రక్షాళనపై రాజీపడేదే లేదని, పారిశ్రామిక వ్యర్థాలతో నదులను మురికికూపాలుగా మారిస్తే సహించబోమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. శనివారం పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామ పరిధిలోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ (వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి) ప్లాంట్‌ను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ప్లాంట్‌లోని కంట్రోల్ రూమ్, మురుగునీటి శుద్ధీకరణ కేంద్రం, ఘనవ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు అన్ని విభాగాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం, అక్కడి సాంకేతికతపై అధికారులతో చర్చించారు. ప్లాంట్ నిర్వహణ, వ్యర్థాల సేకరణ, బాయిలర్ ప్రాసెస్, కర్బన ఉద్గారాల నియంత్రణ వంటి సాంకేతిక అంశాలు, యూనిట్ విద్యుత్ విక్రయ చార్జీలు గురించి పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకున్నారు. జిందాల్ ప్లాంట్‌లో వాడుతున్న అధునాతన కాలుష్య నివారణ పద్ధతులను, రాజమండ్రిలోని ప్రసిద్ధ ఆంధ్ర పేపర్ మిల్లు ఎందుకు పాటించడం లేదంటూ పవన్ కల్యాణ్ అధికారులను ప్రశ్నించారు. పారిశ్రామిక వ్యర్థాలతో నదులు మురికికూపాలుగా మారడాన్ని ఎంతమాత్రం సహించేది లేదని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో నిత్యం టన్నుల కొద్దీ ఉత్పత్తి అవుతున్న చెత్తను శాసీ్త్రయంగా సద్వినియోగం చేసుకునేందుకు, మరిన్ని ఘనవ్యర్థాల నిర్వహణ ప్లాంట్లను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. పర్యటనలో ప్లాంట్ ఆపరేషన్స్ విభాగం ప్రెసిడెంట్ ఎం.వి.చారి, పంచాయతీరాజ్ అధికారి కృష్ణతేజ, కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీర్ నజీమాబేగం, పల్నాడు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ సంజానా సింహ, ఎస్పీ బి.కృష్ణారావు, ఆర్డీఓ బాలకృష్ణ, చిలకలూరిపేట అర్బన్, రూరల్ సీఐలు పి.రమేష్, బి.సుబ్బానాయుడు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


