పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసిన గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌లను వాణిజ్య అవసరాల కోసం వినియోగిస్తున్నారు. వినియోగదారులకు గ్యాస్ సిలిండర్‌లు సరఫరా చేయటంలో నిబంధనలు పెట్టి ఇబ్బందులకు గురిచేసే ఏజెన్సీలు వ్యాపారులకు మాత్రం అడిగినన్ని అందిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అక్రమ వినియోగం కళ్లెదుట కనిపిస్తున్నా అధికారులు నివారణకు చర్యలు చేపట్టకపోవటం ఆరోపణలకు బలాన్ని చేకూరిస్తుంది. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో అధికారులు నామమాత్రంగా తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకొన్నారు. కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే గ్యాస్ అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతుంది. సబ్సిడీతో సామాన్యులకు అందిస్తున్న గృహ గ్యాస్ సిలిండర్‌లు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోవటం ఆందోళన కలిగిస్తుంది.


