నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా పరిధిలో ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్న ఇంటర్మీడియెట్ కళాశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేపట్టారు. జిల్లా ఇంటర్మీయెట్ విద్యాశాఖాధికారి కార్యాలయంలో శనివారం నుంచి పాఠ్యపుస్తకాల పంపిణీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు అన్ని సబ్జెక్ట్‌లకు 3,383, సీనియర్ ఇంటర్ విద్యార్థులకు 3,327 పాఠ్యపుస్తకాలను అందచేయనున్నారు. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ప్రథమ సంవత్సరం 1,016, ద్వితీయ సంవత్సరం 1,030 పుస్తకాలను అందచేయనున్నారు. జెడ్పీ హైస్కూల్స్‌లో 133 (ప్రథమ), 90 (ద్వితీయ), ఏపీఆర్‌జేసీ కళాశాలకు 175 (ప్రథమ), 192 (ద్వితీయ), కస్తూర్బా విద్యాలయాలకు 811 (ప్రథమ), 836 (ద్వితీయ) ఏపీ మోడల్ స్కూల్స్‌లోని ఇంటర్మీయెట్ విద్యార్థులకు 1,248 (ప్రథమ), 1,179 (ద్వితీయ) పుస్తకాలను పింపిణీ చేస్తున్నట్టు జిల్లా ఇంటర్మీయెట్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి తెలిపారు.
సెమీ కండక్టర్ టెక్నాలజీలో శిక్షణకు దరఖాస్తు చేసుకోండి
నరసరావుపేట: బెంగళూరులోని ఇండియన్ ఇన్‌నిస్టిట్యూట్ ఆఫ్ సైన్‌న్స్‌కు చెందిన సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజినీరింగ్ సంస్థ ద్వారా గిరిజన విద్యార్థులకు ఇచ్చే సెమీ కండక్టర్ టెక్నాలజీలో శిక్షణకు జిల్లాలోని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి బి.గోవింద్ నాయక్ శనివారం ఒక ప్రకటన పేర్కొన్నారు. మారుతున్న ఉద్యోగ డిమాండ్లకు అనుగుణంగా విద్యార్థుల కోసం సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్–క్యారెక్టరైజేషన్ శిక్షణ‘ అనే ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. మూడేళ్ల కాలపరిమితి గల ఈ ప్రాజెక్ట్ కింద 1500 మంది గిరిజన విద్యార్థులకు ప్రాథమిక శిక్షణ, 600 మంది గిరిజన విద్యార్థులకు ఉన్నత స్థాయి శిక్షణ అందించడానికి అవకాశం ఉందన్నారు. పౌండేషన్ ప్రోగ్రాం ఆన్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సును ఆన్‌లైన్ విధానంలో 60గంటలు, అడ్వాన్స్‌డ్ ప్రోగ్రాం ఆన్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో 90 గంటలు శిక్షణ ఇస్తారన్నారు. యూజీ ఇంజినీరింగ్, ఎంఎస్‌సీ, పౌండేషన్ ప్రోగ్రామ్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు శిక్షణ ఇస్తారన్నారు. మరిన్ని వివరాలు కోసం వెబ్‌పేజ్ లింకును అనుసరించాలన్నారు.
స్విమ్మింగ్ రాష్ట్ర జట్టు ఎంపిక పోటీలు
నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ ఆక్వాటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం 3వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ వాటర్ పోలో సెలక్షన్స్– 2026 పోటీలు నిర్వహించారు. పల్నాడు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ పర్యవేక్షణలో శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల స్విమ్మింగ్ పూల్‌లో ఈ పోటీలను నిర్వహించారు. పోటీలను కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్, ఏపీ స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి మోహన్ ప్రారంభించారు. రాష్ట్రంలోని 14 జిల్లాల నుంచి 77 మంది స్విమ్మర్లు పోటీలో పాల్గొన్నారు. వీరిలో 55 మంది బాలురు, 22 బాలికలు ఉన్నారు. పోటీలో ప్రతిభ కనపరిచిన క్రీడాకారుల నుంచి 14 మంది చొప్పున బాల బాలికల జట్లు ఎంపిక చేయనున్నారు. ఎంపికై న జట్లు జులై 7 నుంచి 12వ తేది వరకు చైన్నెలో జరగనున్న 79వ సీనియర్ అక్వాటిక్ చాంపియన్‌షిప్–2026 పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని అసోసియేషన్ కార్యదర్శి మోహన్ తెలిపారు. కార్యక్రమంలో పల్నాడుజిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి వై.వి.సుబ్బారెడ్డి, రాష్ట్ర సీనియర్ కోచ్ నటరాజ్, స్విమ్మింగ్ పూల్ కోచ్ జి.సురేష్ పాల్గొన్నారు.
ఆటో డ్రైవర్ మృతి
కారెంపూడి: నడుపుతున్న ఆటో కిందే పడి ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన మండలంలోని బ్రహ్మనాయుడు కాలనీ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. చినగార్లపాడు గ్రామానికి చెందిన కె జానీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బాషా పనుల నిమిత్తం తన నడుపుతున్న ఆటోలో ఒక వ్యక్తిని డ్రాప్ చేయడానికి కారెంపూడి వచ్చాడు. తిరిగి స్వగ్రామం వెళ్తుండగా పెదకొదమగుండ్ల గ్రామ శివారు బ్రహ్మనాయుడు కాలనీ మూల మలుపు వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. తను నడుపుతున్న ఆటో కింద పడి జానీబాషా (24) అక్కడికక్కడే మృతి చెందాడు. ముందున్న మట్టికుప్పను తప్పించబోయి ఆటో అదుపుతప్పి బోల్తా పడినట్లుగా భావిస్తున్నారు. ట్రాక్టర్లు ఇతర వాహనాలకు డ్రైవర్‌గా వెళ్తూ కౌలుకు పొలం సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. ఈ ఘటనతో స్వ గ్రామంలో విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


