వ్యవసాయాన్ని కాపాడుకుందాం | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయాన్ని కాపాడుకుందాం

May 31 2026 1:24 AM | Updated on May 31 2026 1:24 AM

ల్యాండ్‌ బ్యాంకును వ్యతిరేకించండి పాలకుల విధానాలతో రైతు కుదేలు రాజధాని రైతు సంఘం మహాసభలో రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య

తాడేపల్లి రూరల్‌(మంగళగిరి): వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడం ద్వారానే దేశాన్ని రక్షించుకోగలమని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య పేర్కొన్నారు. శనివారం ఉండవల్లిలో రాజధాని రైతు సంఘం 3వ మహాసభ నిర్వహించారు. మహాసభకు అధ్యక్షవర్గంగా ఎస్‌కే పేరు సాహెబ్‌, జి.నాగేశ్వరరావు వ్యవహరించారు. తొలుత రైతు సంఘం జెండాను ప్రజాసంఘాల కార్యాలయం ఎదుట టి.బక్కిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో రైతాంగానికి రెట్టింపు ఆదాయం తెస్తామన్న మోదీ, కూటమి ప్రభుత్వం రైతులు ఆత్మహత్యలు చేసుకునే విధానాలకు నెట్టివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులు వాడకం సగానికి తగ్గించేశారని విమర్శించారు. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులు అమలు చేస్తేనే వ్యవసాయం మనుగడని పేర్కొన్నారు. పొదుపు పేరుతో ఆహార పదార్థాలు, నూనెలు తగ్గించి వాడమంటున్నారని, పాలన చేతకాని ప్రభుత్వాలలే ఇటువంటి విధానాలను అనుసరిస్తున్నాయని విమర్శించారు. దేశంలో తీవ్రంగా ఎరువుల కొరత ఉన్నా ప్రభుత్వాలు సమాధానం చెప్పలేక దాటవేస్తున్నాయని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న ల్యాండ్‌ బ్యాంక్‌ విధానం రైతులను భూముల నుంచి వెళ్లగొట్టడానికే అని స్పష్టం చేశారు. డిజిటల్‌ అగ్రికల్చర్‌ మిషన్‌ పేరుతో 65 శాతం మంది ఆధారపడిన వ్యవసాయాన్ని 10 శాతానికి కుదించే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ అనుసరిస్తున్న విదేశాంగ విధానం వల్ల రూపాయితో డాలర్‌ విలువ తీవ్రంగా పడిపోయందని విమర్శించారు. అమెరికాలో 10 లక్షల మంది భారతీయులు ఇబ్బంది పడుతుంటే కేంద్రం చోద్యం చూస్తోందని విమర్శించారు. మహాసభలో రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకరరావు, ప్రజా సంఘాల నాయకులు ఎం.రవి, కె.జగదీశ్వర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement