లక్ష్మీపురం: మొక్కజొన్న, పొగాకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు కొల్లి రంగారెడ్డి అధ్యక్షతన గుంటూరు కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్‌లో శనివారం సంఘ సమావేశం నిర్వహించారు. సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి వినియోగించే ట్రాక్టర్లకు, ఆయిల్ ఇంజన్లకు డీజిల్ లీటరు రూ.30లకు సరఫరా చేయాలని కోరారు. వ్యవసాయానికి వినియోగించే డ్రోన్‌లకు, పవర్ స్పెయర్లకు రూ.50లకు లీటర్ పెట్రోలు సరఫరా చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు న్యాయమైన ధర కల్పించి, పొగాకు బోర్డు ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న, జొన్న, అపరాలకు రైతులు నష్టపోకుండా స్వామినాథన్ సిఫార్సు మేరకు 50 శాతం మిగులు ఉండునట్లు కొనుగోలు చేయాలన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పచ్చల శివాజీ, కార్యదర్శి యార్లగడ్డ వెంకటేశ్వరరావు, కౌలు రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కంజుల విఠల్ రెడ్డి, పీవీ జగన్నాథం, సీపీఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నాయ కులు ముప్పాళ్ల శివశంకరరావు, పచ్చల సాంబశివరావు, ఆంజనేయులు, వేణు తదితరులు పాల్గొన్నారు.


