చంద్రబాబు సర్కారు అవినీతి, అక్రమాలకు పాల్పడిందని వైఎస్సార్ సీపీ ఆరోపణ
వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన
అంబేడ్కర్‌కు వినతిపత్రం అందజేసి కీలక నేతలు, కార్యకర్తలు, యువత నిరసన
నిజాలు నిగ్గు తేల్చడానికి వెంటనే సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ముఖ్య నాయకుల డిమాండ్
సాక్షి, నరసరావుపేట, నరసరావుపేట: చంద్రబాబు ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరిట అంతా దగా చేసిందని వైఎస్సార్ సీపీ కీలక నేతలు మండిపడ్డారు. విద్యాశాఖ నిర్వహించిన మెగా డీఎస్సీ అవకతవకలతో అయోమయంగా మారిందని, జరిగిన అక్రమాలపై వెంటనే దేశ అత్యున్నత స్థాయి దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్‌కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం నరసరావుపేటలో మెగా డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ జరిగిన నిరసన కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వినుకొండ మాజీ శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవరెడ్డి, విద్యార్థి, యువత విభాగం, పార్టీ సీనియర్ నేతలు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి స్థానిక గడియార స్తంభం సెంటర్ వద్దనున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహం వరకు వందల మంది విద్యార్థులు, నాయకులతో కలిసి ద్విచక్ర వాహన ర్యాలీ చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి నేతలు వినతి పత్రం అందించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, ప్లకార్డులు ప్రదర్శించారు.
ఉద్యోగాలు విక్రయించిన సర్కార్
డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ విద్యాశాఖను లోకేష్ భ్రష్టు పట్టించారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ అవకతవకలతో దగా డీఎస్సీగా మారిందన్నారు. కంప్యూటర్ సెక్షన్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న వ్యక్తికి కృష్ణా జిల్లా డీఎస్సీలో ఫస్ట్ ర్యాంకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. మెగా డీఎస్సీలో పేపరు లీక్ అయిన మాట వాస్తవం కాదా అన్నారు. పేపర్ లీక్ అయిన విషయం తెలిసి కూడా లోకేష్ మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ఎందుకు చర్యలు తీసుకోలేదని అన్నారు. మెగా డీఎస్సీ మెరిట్ లిస్టు ఎందుకు రిలీజ్ చేయలేదని, ఉద్యోగాలు ఇవ్వదలుచుకున్న వారికే కాల్ లెటర్స్ పంపించిన మాట వాస్తవం కాదా అని పేర్కొన్నారు. మెరిట్ లిస్టు రిలీజ్ చేయకుండా జాయినింగ్ లెటర్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఆటలాడటమే తెలియని వారికి స్పోర్ట్స్ కోటా కింద రూ.15 లక్షల చొప్పున తీసుకుని 450 మందికి ఉద్యోగాలు అమ్ముకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. కోర్టు మెరిట్ లిస్టు ఇవ్వమన్నా ఎందుకు స్పందించడం లేదని మంత్రి లోకేష్‌ను నిలదీశారు. మెగా డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ దర్యాప్తునకు అడుగుతున్నా ఎందుకు వెనుకంజ వేస్తున్నారని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
పేపర్ లీక్ వల్లే టాప్ ర్యాంక్‌లు...
ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఇయం.స్వామి మాట్లాడుతూ సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా పేపర్ తయారు చేశారని, అందువలనే పనిచేసే వారికే టాప్ ర్యాంకులు వచ్చాయన్నారు. అందుకే దీనిని దగా డీఎస్సీ అంటున్నామని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పూర్వ పద్ధతిలో కమిటీ ఏర్పాటు చేసి అర్హులైన వారికే ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. డబ్బులు కట్టిన వారికే ఉద్యోగాలు ఇస్తే వ్యవస్థ సర్వనాశనం అవుతుందని హెచ్చరించారు.
కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు పాలపర్తి వెంకటేశ్వరరావు, గంటెనపాటి గాబ్రియేలు, ఎన్‌కే ఆంజనేయులు, అంగన్‌వాడీ విభాగ రాష్ట్ర కార్యదర్శి హెల్డా ఫ్లోరెన్స్, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ బూదాల కల్యాణ్, ఎస్‌సీ సెల్ జిల్లా కార్యదర్శి నెలటూరి సురేష్, పట్టణ అధ్యక్షుడు షేక్ కరిముల్లా, వర్కింగ్ అధ్యక్షుడు అచ్చిశివకోటి, నకరికల్లు మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి, విద్యార్థి విభాగ రాష్ట్ర కార్యదర్శి ఉప్పుతోళ్ల సతీష్, మాజీ ఎంపీపీ టి.మంగమ్మ, జిల్లా కోశాధికారి అన్నా చంద్రమోహన్, పలు విభాగాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్‌కుమార్ మాట్లాడుతూ అక్రమాలు చేసేందుకే విద్యాశాఖను మంత్రి లోకేష్‌కు కేటాయించారన్నారు. డీఎస్సీ నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. విద్యావ్యవస్థను మెరుగుపరిచే ఆలోచన లేని లోకేష్ డీఎస్సీ ఉద్యోగాలను రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలకు విక్రయించారన్నారు. ఎస్‌సీ, ఎస్‌టీలకు ఉచిత కోచింగ్ సెంటర్ 90 రోజులుపాటు నిర్వహిస్తామని చెప్పి కేవలం 35 రోజులకే ముగించి డీఎస్సీ పరీక్ష నిర్వహించారన్నారు.


