మ్యాజిక్‌ డ్రెయిన్‌ పరిశీలన | - | Sakshi
Sakshi News home page

మ్యాజిక్‌ డ్రెయిన్‌ పరిశీలన

May 30 2026 3:08 AM | Updated on May 30 2026 3:08 AM

మ్యాజిక్‌ డ్రెయిన్‌ పరిశీలన క్రీడాకారులను అభినందించిన కలెక్టర్‌ సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

ప్రత్తిపాడు: ప్రత్తిపాడు మండలం బొర్రావారిపాలెంలో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన మ్యాజిక్‌ డ్రెయిన్‌ను శుక్రవారం ఏపీ పంచాయతీరాజ్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ కృష్ణతేజ, రాజ్యసభ సభ్యుడు సి.విజయేంద్రప్రసాద్‌లు పరిశీలిచారు. జిల్లా, స్థానిక అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించిన వారు మ్యాజిక్‌ డ్రెయిన్‌ పనితీరు, మురుగు ఇంకే విధానం స్వయంగా అధ్యయనం చేశారు. నిర్మాణానికి ఎంత ఖర్చు అయ్యింది, నిర్మాణానికి రా మెటీరియల్‌ ఏమేమి ఎంత మొత్తంలో వినియోగించారు, పనితీరు ఎలా ఉంది అనే అంశాలను ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపీవో ఏడుకొండలును అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. మ్యాజిక్‌ డ్రెయిన్‌ వలన ఉపయోగాలేమైనా ఉన్నాయా, గతంలో మురుగు పారుదలకు, ఇప్పుడు మ్యాజిక్‌ డ్రెయిన్‌తో మురుగు ఇంకుతున్న తీరుకు ఏమైనా తేడా గమనించారా అని ప్రశ్నించారు. గతంలో మురుగు సక్రమగా తియ్యక, పారుదల లేక రోజుల తరబడి నిలిచి దోమల ఉధృతి అధికంగా ఉండేదని, కానీ ఇప్పుడు ఈ డ్రెయిన్‌ నిర్మాణంతో మురుగు అంతా ఇంకిపోతుందని మహిళలు తెలిపారు. డ్వామా పీడీ వి.శంకర్‌, జెడ్పీ సీఈవో జ్యోతిబసు, డీవీవో హనుమతంరావు, ఎంపీడీవో కె.శివపార్వతి, ఏపీవో ఏడుకొండలు తదితరులున్నారు.

స్వచ్ఛరథాన్ని సద్వినియోగం చేసుకోవాలి

పెదకాకాని: ప్రభుత్వం పారిశుధ్య నిర్వహణను ప్రోత్సహించడానికి స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యం సాధించడానికి స్వచ్ఛరథం కార్యక్రమం నిర్వహిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషనర్‌ మైలవరపు కృష్ణతేజ అన్నారు. మండల పరిధిలోని అనుమర్లపూడి గ్రామంలో శుక్రవారం స్వచ్ఛ రథం పనితీరును పరిశీలించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్‌, జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, డీపీఓ నాగసాయి కుమార్‌, ఎంపీడీఓ రమావత్‌ శ్రీనివాసరావు, ఈఓపీఆర్డీ కెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): చైనాలో ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించిన సబ్‌ జూనియర్‌, జూనియర్‌ పవర్‌ లిఫ్టింగ్‌ ఏషియన్‌ ఎక్విప్డ్‌ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులను కలెక్టర్‌ సి.ఎం.సాయికాంత్‌ వర్మ అభినందించారు. గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చెందిన క్రీడాకారులు జూనియర్‌ విభాగంలో ఇ.లక్ష్మి వినయశ్రీ, మదిన షారూను బ్రాంజ్‌ పతకాలు, సబ్‌ జూనియర్‌ కేటగిరీలో బి.లిఖిత బ్రాంజ్‌ మెడల్‌ సాధించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో కలెక్టర్‌ సి.ఎం.సాయి కాంత్‌ వర్మను క్రీడాకారులు మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌ వారితో ముచ్చటించి సాధన, పోటీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్‌ స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పి.అఫ్రోజ్‌ ఖాన్‌, కోచ్‌ సాయి రేవతి పాల్గొన్నారు.

పెదకాకాని: పెదకాకాని మండల పరిధిలోని తక్కెళ్లపాడు గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన లలితా పీవీఎస్‌ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి జూన్‌ 3వ తేదీన సీఎం నారా చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో భద్రత, బందోబస్తు, ఇతర సమన్వయ ఏర్పాట్లను గుంటూరు జిల్లా కలెక్టర్‌ సి.ఎం. సాయికాంత్‌ వర్మ, జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌లు శుక్రవారం పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణ, భవన అంతస్తులను సందర్శించారు. ఆసుపత్రి ప్రారంభోత్సవం వద్ద నుంచి సీఎం సందర్శించే ప్రాంతాలు, వేదిక ఏర్పాట్లు, వీవీఐపీల రాకపోకల మార్గాలు, ప్రజల రాకపోకలు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు. సీసీ కెమెరాలు, ట్రాఫిక్‌, పార్కింగ్‌ ఏర్పాటుపై చర్చించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ, అదనపు ఎస్పీ ఏటీవీ రవికుమార్‌, ఆర్డీఓ శ్రీనివాసరావు, పెదకాకాని సీఐ టీపీ నారాయణస్వామి, ఆయా శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement