అమృతరావు దాడి ఘటనపై
కేంద్ర మంత్రి పెమ్మసాని క్షమాపణ
నగరంపాలెం: గుంటూరు నగర కమిషనర్ కార్యాలయంపై టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపాటి అమృతరావు దాడి ఘటన, అనంతరం ప్రెస్‌మీట్ నిర్వహించి కమిషనర్‌పై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ క్షమాపణ చెప్పారు. గుంటూరు నగరంలోని బృందావన్‌గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలోని నార్ల ఆడిటోరియం పునః ప్రారంభ పనులను శుక్రవారం ప్రారంభించారు. అనంతరంసభలో మంత్రి మాట్లాడుతూ... గుంటూరు నగర కమిషనర్ చాలా నిజాయతీ, కష్టపడే వ్యక్తిత్వం ఉన్నవారని చెప్పారు. ఈ నెల 25వ తేదీన గుంటూరు నగర కమిషనర్ కార్యాలయంలో అమృతరావు గొడవ చేశారని, ఆ తర్వాత విలేకర్ల సమావేశంలో కమిషనర్ గురించి మాట్లాడారని గుర్తుచేశారు. కమిషనర్‌పై ఇలా మాట్లాడితే సమాజంలో మంచి చేయడానికి ఎవరూ మిగలరని అన్నారు. టీడీపీ, జనసేన, భాజపా నాయకులకు ఇబ్బందులుంటే ఎమ్మెల్యే వద్దకు వెళ్లాలని, లేదంటే తన వద్దకు రావాలని సూచించారు. వెంటనే పనులు కాకుంటే కూర్చుని మాట్లాడుకోవాలని చెప్పారు. ఇలా ఆఫీస్‌లపైకి వెళ్తే ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుందని అన్నారు. దీనికిగాను నగర కమిషనర్‌కి బహిరంగ క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నారు. పెమ్మసాని మాట్లాడే సమయంలో ఒక్కసారిగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కార్యక్రజుమంలో పెమ్మసాని చంద్రశేఖర్‌తోపాటు ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, జనసేన నాయకులు, నగర కమిషనర్ మయూర అశోక్, అన్నమయ్య సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.


