మూడు పల్టీలు కొట్టిన కారు | - | Sakshi
Sakshi News home page

మూడు పల్టీలు కొట్టిన కారు

May 30 2026 2:50 AM | Updated on May 30 2026 2:50 AM

పొలం ఆక్రమించిన కౌలు రైతు

తాత, మనవరాలికి గాయాలు

యడ్లపాడు: రోడ్డు ప్రమాదంలో తాతా మనవరాలికి గాయాలైన సంఘటన శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం...చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన జగదీష్‌(75) తన 8 ఏళ్ల మనవరాలు జగదీశ్వరితో కలిసి కారు లో తిమ్మాపురం వైపు బయలుదేరారు. కారు తిమ్మాపురం సమీపానికి చేరుకునే సరికి ఒక్కసారిగా అదుపు తప్పి, రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను కారు ఢీకొట్టింది. మూడు పల్టీలు కొట్టి బోల్తా పడింది. కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఎయిర్‌ బ్యాగులు తెరుచుకోవడంతో కారులోని ఇద్దరూ గాయాలతో బయటపడ్డారు. పెనుప్రమాదం తప్పిందని స్థానికులు ఊపీరిపీల్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 అత్యవసర వాహన సిబ్బంది క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం తక్షణమే ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న యడ్లపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని..ప్రమాదానికి గురైన వాహనాన్ని పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రెండు లారీలు ఢీ..

దాచేపల్లి: రెండు లారీలు ఢీకొని డ్రైవర్‌ తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌ వైపు నుంచి చైన్నె వెళుతున్న లారీని తంగెడ నుంచి హైదరాబాద్‌ వైపు వెళుతున్న లారీ అతివేగంగా వచ్చి దాచేపల్లిని ముత్యాలంపాడు రోడ్డు సెంటర్‌లో ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు లారీల క్యాబిన్లు ఒకదానిలో ఒకటి ఇరుక్కుపోయాయి. ఈ ఘటనలో హైదరాబాద్‌ వైపు నుంచి చైన్నె వెళుతున్న లారీ డ్రైవర్‌ తిరుపతిరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటహుటిన సంఘటన స్థలానికి చేరుకుని లారీలో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ తిరుపతిరెడ్డిని అతికష్టం మీద బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఖాసీంవలి చెప్పారు.

దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం

ఒకరు మృతి.. పలువురికి గాయాలు

నూజెండ్ల: మండల పరిధిలోని బుర్రిపాలెం గ్రామానికి చెందిన పోతుగంటి బాలిశెట్టి (70) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ప్రకాశం జిల్లా మేడపి సమీపంలో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. బాలిశెట్టి తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం వెళ్లి వస్తుండగా మేడపి సమీపంలో కారు అదుపు తప్పి పక్కనే ఉన్న గుంతలోకి దూసుకెళ్ళింది. ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలు కాగా వారిని ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో బాలిశెట్టి మార్గంమధ్యలో మృతి చెందాడు. ఈయనకు భార్య సుబ్బమ్మ ఆరుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఆయన భౌతిక కాయాన్ని గ్రామానికి తరలించగా శుక్రవారం జరిగిన అంత్యక్రియల్లో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాలిశెట్టి గ్రామంలో 22 సంవత్సరాలుగా ప్రభుత్వ రేషన్‌ దుకాణం నిర్వహిస్తూ వివాదరహితుడిగా పేరు తెచ్చుకొన్నారు.

నాలుగు కేసుల్లో నిందితుడికి శిక్ష

పిడుగురాళ్ల: నాలుగు కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తికి శిక్ష పడినట్లు పిడుగురాళ్ల పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మాచర్ల పట్టణానికి చెందిన అడిగే మనీ పవన్‌కుమార్‌ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లను ధ్వంసం చేసి వాటిలోని రాగి(కాపర్‌) వైర్‌ చుట్టలను దొంగలించిన కేసులో కోర్టు శిక్ష విధించినట్లు తెలిపారు. పిడుగురాళ్ల పట్టణంలో రెండు కేసులు, మాచరవరం పోలీస్‌ స్టేషన్‌లో ఒక కేసు, మాచర్ల పట్టణంలో ఒక కేసులు నమోదయ్యాయి. పిడుగురాళ్ల కోర్టు పరిధిలోని కేసును న్యాయమూర్తి టి. ప్రవల్లిక విచారణ చేసి ఆరు నెలల సాధారణ జైలు శిక్షతోపాటు రూ. 1000 చొప్పున అపరాధ రుసుం విధించారు. అపరాధ రుసుం చెల్లించని పక్షంలో అదనంగా 15 రోజుల జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించినట్లు సీఐ తెలిపారు.

కోర్టును ఆశ్రయించిన భూమి యజమాని

నాదెండ్ల: నా తండ్రి ద్వారా సంక్రమించిన ఐదెకరాల భూమిని కౌలుకు తీసుకున్న వ్యక్తి ఆక్రమించుకుని తనపై దౌర్జన్యానికి పాల్పడుతున్నాడంటూ ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. బాధిత రైతు చిలకలూరిపేట పట్టణంలో నివాసం ఉండే సిద్ధాబత్తుని కోటేశ్వరరావు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల కోటాలో నా తండ్రి నరసింహారావుకు 1971లో నాదెండ్ల గ్రామ రెవెన్యూ పరిధిలోని 476–2బి సర్వే నెంబరులో ఐదెకరాల భూమిని ప్రభుత్వం కేటాయించి పట్టా మంజూరు చేసిందన్నారు. కొన్నేళ్లు తామే వ్యవసాయం చేసుకుని పంట పండించి జీవించామన్నారు. తాను డ్రైవర్‌గా పనిచేస్తూ సుమారు 1990లో పొలాన్ని గ్రామానికి చెందిన బత్తిన కోటేశ్వరరావు అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చినట్లు తెలిపాడు. ప్రతి ఏటా కౌలు చెల్లిస్తూ వచ్చిన కోటేశ్వరరావు, కొన్నేళ్ళుగా సదరు పొలం తనదంటూ కౌలు ఇవ్వకుండా తనను, తన కుటుంబంపై దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని వాపోయాడు. ఈ విషయమై పలుమార్లు కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, చేసేది లేక న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపాడు. న్యాయస్థానం తీర్పు వెలువడే వరకూ బత్తిన కోటేశ్వరరావును పొలంలోకి వెళ్ళకుండా అధికారులు అడ్డుకోవాలని కోరాడు.

Advertisement
 
Advertisement
Advertisement