ఈదురు గాలులకు కూలిన జీవ ధ్వజస్తంభం | - | Sakshi
Sakshi News home page

ఈదురు గాలులకు కూలిన జీవ ధ్వజస్తంభం

May 30 2026 2:50 AM | Updated on May 30 2026 2:50 AM

స్థలాలు ఆక్రమించేందుకు టీడీపీ నాయకుల యత్నం

అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడి

నాదెండ్ల: మండలంలోని పలు గ్రామాల్లో గురువారం రాత్రి ఈదురు గాలులకు విద్యుత్‌స్తంభాలు విరిగిపడటంతో సరఫరా నిలిచింది. సుమారు గంట పాటు భీకరంగా ఈదులు గాలులు వీయటంతో గణపవరం గ్రామంలోని రుక్మిణిసత్యభామ సమేత సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో జీవ ధ్వజస్తంభం విరిగిపడింది. సుమారు 160 ఏళ్ళ క్రితం గ్రామానికి చెందిన అనుమంచి హనుమంతరావు నిర్మించిన ఆలయంలో 1987 సంవత్సరంలో జీవధ్వజ స్తంభం ప్రతిష్ట నిర్వహించారు. 2018 జూన్‌లో నూతన ధ్వజస్తంభం పునఃప్రతిష్టించారు. అప్పట్లో ధ్వజస్తంభానికి అమర్చిన మానికల నుంచి వర్షపునీరు దిగి ధ్వజస్తంభం మొదలు చచ్చుబడటంతో ఈదురుగాలులకు విరిగిపడింది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఎదురుగా చెట్టు విరిగి విద్యుత్‌ స్తంభాలపై పడటంతో తీగలు తెగి ఉదయం వరకూ విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

నేడు ‘రాష్ట్ర స్థాయి వాటర్‌ పోలో’ జట్ల ఎంపికలు

నరసరావుపేట: పల్నాడు జిల్లా స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం నరసరావుపేటలోని ఎస్‌ఎస్‌ఎన్‌ కళాశాల స్విమ్మింగ్‌ పూల్‌లో ‘3వ సీనియర్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ వాటర్‌ పోలో సెలెక్షన్స్‌ నిర్వహించనున్నట్లు అసోసియేషన్‌ కార్యదర్శి వైవీ. సుబ్బారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికల ద్వారా రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించే పురుషుల, మహిళల జట్లను ఎంపిక చేస్తారన్నారు. ఇక్కడ ఎంపికై న జట్లు 2026 జూలై 17 నుండి 24 వరకు గుజరాత్‌ రాష్ట్రం రాజ్‌కోట్‌లోని ‘సరదార్‌ పటేల్‌ అక్వాటిక్‌ కాంప్లెక్స్‌’లో జరగబోయే ‘78వ సీనియర్‌ నేషనల్‌ అక్వాటిక్‌ ఛాంపియనన్‌షిప్‌‘ పోటీలలో పాల్గొంటాయని పేర్కొన్నారు. ఉదయం ఏడు గంటల నుంచి క్రీడాకారుల రిజిస్ట్రేషన్‌ ప్రారంభమవుతుందని, ఉదయం 7:30 గంటలకు ఎంపిక పోటీలు (ట్రయల్స్‌) మొదలవుతాయని వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు ఈ ఎంపికలలో పాల్గొనవచ్చని, అభ్యర్థులు నిర్ణీత సమయానికి వేదికకు చేరుకోవాలని కోరారు. క్రీడాకారుల ప్రతిభను పారదర్శకంగా అంచనా వేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, జిల్లాలో వాటర్‌ పోలో క్రీడాభివృద్ధికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పిడుగురాళ్ల: వైఎస్సార్‌ సీపీ నాయకులు స్థలాలు మావని ముందుకు వస్తే దాడులు తప్పవని టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడికి దిగిన సంఘటన పట్టణంలోని స్వర్ణ పిచ్చయ్య కాలనీలో శుక్రవారం జరిగింది. వైఎస్సార్‌సీపీ నాయకులు ఓర్సు బ్రహ్మయ్య, ఓర్సు దుర్గారావు, ఓర్సు శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు... పట్టణంలోని స్వర్ణ పిచ్చయ్య కాలనీలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తన్నీరు కల్యాణికి రెండు సెంట్ల స్థలాన్ని స్వర్ణ పిచ్చయ్య కాలనీలో పట్టా ఇచ్చారు. ఇప్పుడు ఆ స్థలంలో మున్సిపల్‌ కార్యాలయానికి చెందిన పొక్లెయినర్‌ వచ్చి గుంతలు తీస్తుండటంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఓర్సు దుర్గారావు, ఓర్సు బ్రహ్మయ్య, ఓర్సు శ్రీనివాసరావులు ఈ స్థలంలో గుంతలు ఎందుకు తీస్తున్నారని ప్రశ్నించటంతో పొక్లెయినర్‌ గుంతలు తీయటం నిలిపివేసింది. ఇంతలోనే అక్కడే ఉన్న టీడీపీ నాయకులు బుత్తుల శ్రీనివాసరావు, బత్తుల వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ కార్యాలయంలో పని చేసే బత్తుల నాగరాజు, చెన్నయ్యతోపాటు మరికొంత మంది మహిళలు సుమారు 30 మంది దాకా హాజరై దాడికి పాల్పడ్డారు. దాడిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓర్సు బ్రహ్మయ్య, ఓర్సు శ్రీనివాసరావు, ఓర్సు దుర్గారావుకు స్వల్ప గాయాలు అయ్యాయి. వైఎస్సార్‌సీపీ నాయకులు ఎవరైనా సరే స్థలం వద్దకు వచ్చి తమదేనంటే వారిపై దాడులు చేయటానికి తామంతా సిద్దంగా ఉన్నామని టీడీపీ నాయకులు బహిర్గతంగానే తెలుపుతున్నారు. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యేనే వైఎస్సార్‌సీపీ స్థలాలు అక్రమించుకొని తెలిపినట్లుగా టీడీపీ నాయకులు బహిరంగంగా చెప్పి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం ఉందని, తాము చేసిందే రైట్‌ అని, అడ్డు ఎవరు చెప్పినా వారిని ఉపేక్షించేది లేదని, భయపెడుతున్నారని, వైఎస్సార్‌సీపీ నాయకులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement