పురాతన మసీదులో జుమ్మా నమాజ్‌ | - | Sakshi
Sakshi News home page

పురాతన మసీదులో జుమ్మా నమాజ్‌

May 30 2026 2:50 AM | Updated on May 30 2026 2:50 AM

కొండవీడు కొండలపై షాహీ మసీదులో ప్రార్థనలు తరలివచ్చిన పలు జిల్లాల ముస్లిం సోదరులు, మత పెద్దలు దేశ సౌభాగ్యం, రైతాంగ శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు

యడ్లపాడు: చారిత్రక కొండవీడు కొండలు శుక్రవారం ఆధ్యాత్మిక చేతనతో విరాసిల్లాయి. కొండలపై ఉన్న అత్యంత పురాతనమైన షాహీ జుమ్మా మసీదులో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక జుమ్మా నమాజ్‌ ఆచరించారు. ఈ అరుదైన ఆధ్యాత్మిక ఘట్టంలో పాల్గొనేందుకు అమరావతి, గుంటూరు, నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, వేములూరిపాడు, అమీనాబాద్‌, కొమ్మెరిపూడి, తురకపాలెం, పెదకాకాని తదితర ప్రాంతాల నుంచి ముస్లింలు, మత పెద్దలు కొండవీడు కోటకు తరలివచ్చారు.

లోకకల్యాణం కోసం ప్రత్యేక దువా

నమాజ్‌ అనంతరం దేశ, ప్రపంచ శాంతి కోసం ముస్లిం పెద్దలు ప్రత్యేక దువా(ప్రార్థన) చేశారు. భారతదేశంలో భిన్న సంస్కృతులు, మతాల మధ్య సౌభ్రాత్వత్వం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. దేశంలో ఆర్థిక అసమానతలు తొలగిపోయి, అందరికీ సమాన అవకాశాలు లభించాలని ప్రార్థించారు. మానవాళికి వెన్నుముక అయిన రైతన్నల కష్టాలు తీరాలని, ప్రకృతి కరుణించి పంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నారు. పండిన పంటకు మార్కెట్‌లో మంచి గిట్టుబాటు ధర దక్కాలని, అంతర్జాతీయ ఎగుమతులు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగాలని అల్లాహ్‌ను ప్రార్థించారు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ మొహమ్మద్‌ ఇస్‌హాక్‌ నద్వీ మాట్లాడుతూ..కొండవీడు కోట పర్యాటక అభికృద్ధితో పాటు ఇక్కడి చారిత్రక షాహీ జుమ్మా మసీదును, కొండలపై ఉన్న హజరత్‌ సూఫీ సయ్యద్‌ షా రహతుల్లా అలైహ్‌ దర్గాను పునరుద్ధరించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అనంతరం భక్తులంతా కలిసి పురాతన దర్గాను సందర్శించారు. కార్యక్రమంలో నౌ అవర్‌ హిస్టరీ(గుంటూరు) సంస్థ అధ్యక్షులు, మసీదు అభికవృద్ధి కమిటీ ప్రతినిధి సూఫీ ఇమ్రాన్‌, పెద్దలు మస్తాన్‌, అహ్మద్‌, అబ్దుల్‌ రజాక్‌, ఇమ్రాన్‌, అఫీజుల్లా, అబ్దుల్‌ అజీజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement