దళారుల మాయమాటలకు మోసపోతున్న నిరుద్యోగులు, తల్లిదండ్రులు రూ.లక్షల్లో వసూలు చేసి ముఖం చాటేస్తున్న వైనం ఎస్పీ కార్యాలయంలో వారం వారం ఇదే తరహా ఫిర్యాదులు ఏడాది కాలంలో 66 ఫిర్యాదులు అందినా.. దక్కని న్యాయం
చంద్రబాబు ప్రభుత్వం ఇస్తామన్న ఉద్యోగాలు, నిరుద్యోగభృతి ఇవ్వకపోవడంతో ఇంటి వద్దే ఉంటున్న యువత తల్లిదండ్రులకు భారం కాకూడదన్న ఉద్దేశంతో ఆన్‌లైన్‌లో ఉన్న వివిధ జాబ్ పోర్టల్స్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు కేటుగాళ్లు ఫేక్ ప్రొఫైల్స్‌తో నిరుద్యోగులకు గాలం వేస్తున్నారు. విదేశాలలో ఉద్యోగాలంటూ వీసా, వర్క్ పర్మిట్ పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. మరికొందరు రూ.లక్షలు తీసుకొని ఫేక్ జాయినింగ్ లెటర్లు అందజేసి ఉడాయిస్తున్నారు.
సాక్షి, నరసరావుపేట: ‘మంచి ఉద్యోగం.. భవిష్యత్తు బంగారం.. ఆలోచిస్తే నీకే నష్టం.. ఇది ఖర్చు కాదు పెట్టుబడి.. నీవు కాదంటే చెప్పు.. నీకంటే డబుల్ ఇచ్చేవాళ్లు సిద్ధంగా ఉన్నారు..’ ఇవీ నిరుద్యోగులను బుట్టలో వేసుకునేందుకు మోసగాళ్లు చెప్పే బురిడీ మాటలు. వీరి మాటల్లో పడి, వారు చూపే ఆశలకు లొంగి వందలాది మంది యువత, తల్లిదండ్రులు డబ్బులు చెల్లించి నిలువునా మోసపోతున్నారు. తీరా చూస్తే ఉద్యోగం రాక, ఇచ్చిన నగదు వెనక్కి రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. కొందరైతే ఉద్యోగం సాధించలేకపోగా ఇలా డబ్బులు పోగొట్టుకున్నారని సమాజంలో తెలిస్తే పరవుపోతుందని మోసపోయినా ఏం చేయకుండా మిన్నకుండిపోతున్నారు. మరికొందరు ధైర్యంగా ఫిర్యాదులు చేస్తున్నారు.
ఏడాది కాలంలో 66 ఫిర్యాదులు
పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి గతేడాది మార్చి నుంచి ఇప్పటివరకు 66 మంది ఉద్యోగాల పేరిట మోసపోయామని ఫిర్యాదులు చేశారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉండే అవకాశముందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మాచర్ల, చిలకలూరిపేట రూరల్, నరసరావుపేట రూరల్, నరసరావుపేట టూటౌన్, పిడుగురాళ్ల స్టేషన్ల పరిధిలో ఎక్కవగా జాబ్ పేరిట మోసాలు జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. కష్టాన్ని నమ్ముకొని నైపుణ్యం పెంచుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేయాలని, దళారుల మాటలకు మోసపోవద్దని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
టాస్కులు సైతం అప్పగిస్తూ..
కేటుగాళ్లు మరొక అడుగు ముందుకేసి ఉద్యోగాలు వచ్చినట్టు నమ్మించి కొన్ని టాస్క్‌లు అప్పగించి వారితో పనిచేయిస్తున్నారు. తొలుత చిన్న మొత్తంలో నగదు జమ చేసి మరింత పెద్ద ఉద్యోగం కోసమంటూ భారీ స్థాయిలో నగదు తీసుకుంటున్నారు. బంధుమిత్రులను చేర్పిస్తే కమీషన్ అంటూ ఆశచూపి మరింత మందిని మోసం చేసి ఫోన్లు, వెబ్‌సైట్లను నిలిపేసి జెండా ఎత్తేస్తున్నారు. ఈ తరహా సైబర్ నేరాలబారిన పడిన వారు పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వారం వారం వస్తుంటారు. సైబర్ నేరాల బారిన పడ్డామనే అనుమానం రాగానే టోల్ ఫ్రీ నెంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని పోలీసులు చెబుతున్నారు. ఏదైనా కంపెనీ ఉద్యోగం ఇచ్చేముందు నగదు చెల్లించమని అడగదన్న విషయాన్ని మొదట నిరుద్యోగులు గుర్తిస్తే మోసం పోయే అవకాశముండదని హెచ్చరిస్తున్నారు.
ఎస్పీ కార్యాలయానికి వచ్చిన
ఫిర్యాదుల్లో కొన్ని...
పిడుగురాళ్లకు చెందిన ఓ యువకుడు చదువుపూర్తి చేసి హైదరాబాద్‌లో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. అక్కడ పరిచయమైన ఓ వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని రూ.2.5లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగం ఎంతకు రాకపోవడంతో మోసపోయానని తెలుసుకొని డబ్బులు అడగ్గా ఏవేవో చెప్పి చివరకు చెక్కులపై సంతకం చేసి ఇచ్చాడు. బ్యాంక్‌కు వెళ్లి చూస్తే వాటిలో డబ్బులు లేవని తేలింది. నిందితుడు నుంచి డబ్బులు వచ్చేలా చూడమని, ఇప్పటికే మూడుసార్లు పోలీసుల చుట్టూ తిరిగానని న్యాయం చేయలేదని పోలీసు పీజీ ఆర్‌ఎస్‌లో ఎస్పీని కలసి విన్నవించాడు.


