అభయమేది... బాబూ? | - | Sakshi
Sakshi News home page

అభయమేది... బాబూ?

May 29 2026 2:25 AM | Updated on May 29 2026 2:25 AM

చంద్రబాబు ప్రభుత్వంలో కొండెక్కిన అభయం ప్రాజెక్ట్‌ జిల్లాలో కనీసం ఒక్కటి కూడా పూర్తి కాని దుస్థితి వైఎస్సార్‌ సీపీ సర్కారు హయాంలో ఆటోల్లో రక్షణ చర్యలు కూటమి అధికారంలోకి వచ్చాక ఆ ఊసే కరువు

అధికారంలోకి రాగానే నిర్లక్ష్యం

పట్నంబజారు: హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళ గత కొద్ది రోజుల క్రితం ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చారు. అక్కడ ఆమె ఆటో ఎక్కిన తరువాత ఆటో డ్రైవర్‌ దుర్బుద్ధితో ఆమైపె అత్యాచారయత్నానికి ఒడిగట్టడంతో పాటు ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలు దోచుకుపోయాడు. ఇప్పటివరకు ఆ కేసు ఏమైందో కూడా పోలీసులు మాత్రం చెప్పటం లేదు. అంతకుముందు కొన్నాళ్ల క్రితం ఒక యువతిని నలుగురు తాగుబోతులు ఆటోలో ఎక్కించుకుని మణిపురం ఓవర్‌ బ్రిడ్జి వద్దే ఆమెను ఇబ్బందులకు గురి చేశారు. ఆ సమయాల్లో వారికి అండగా నిలిచేందుకు ఏ ఒక్క పరికరం అందుబాటులో లేకుండా పోయింది.

అభాగ్యులకు అండగా..

ఇటువంటి పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకుని అత్యంత ప్రాధాన్యత కలిగిన పథకం ‘‘అభయం’’ ప్రాజెక్టు. అర్ధరాత్రి, ఇతర ఆపత్కర పరిస్థితుల్లోనైనా.. డ్రైవర్‌ రాంగ్‌ రూట్‌లో తీసుకుని వెళ్లినా.. వెంటనే బాధితులకు అండగా నిలవాలన్నదే అభయం ఉద్దేశం. మహిళలు, యువతులు, విద్యార్థినులకు సంబంధించి ఏదైనా సమస్య ఎదురైతే వారికి క్షణాల వ్యవధిలో రక్షణ కలిగించేలా రెండున్నర సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా నిలిచింది. ఈ మహోన్నత కార్యక్రమానికి చేయూతనిస్తూ.. గుంటూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో, ముఖ్యంగా అర్ధరాత్రి పూట తిరిగే ఆటోల్లో అభయం మిషన్‌ ఏర్పాటుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు.

క్యూఆర్‌ స్కానింగ్‌లోనే వివరాలు...

అభయం ప్రాజెక్టు కింద ఆటోల్లో పరికరం బిగించే సమయంలో ఇంజిన్‌కు కనెక్షన్‌ ఇస్తారు. దీంతో జీపీఎస్‌ ట్రాకింగ్‌తోపాటు, ప్యానిక్‌ బటన్‌ ఉంటాయి. ప్రయాణికులు ఆటో ఎక్కే ముందు ఫోన్‌లో ప్లే స్టోర్‌ ద్వారా అభయం యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుని, ఆటోపై ఏర్పాటు చేసిన క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే.. ఆటో నంబర్‌, డ్రైవర్‌ ఫొటో, అతని పేరు, సెల్‌నెంబర్‌లు అందులో వచ్చేస్తాయి. త్వదారా అసలు ఆటోలో ఉన్న వ్యక్తి సంబంధిత వ్యక్తా? వేరే వారా? అని నిర్ధారించుకోవచ్చు.

అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో...

అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ట్రాకింగ్‌ పరికరాన్ని ఆటోల్లో అమర్చుతారు. వాహనానికి క్యూఆర్‌ కోడ్‌ ఇస్తారు. వాహనాన్ని స్టార్ట్‌ చేసే సమయంలో డ్రైవర్‌ తనకు జారీ చేసిన స్మార్ట్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఐఓటీ డివైస్‌ పరికరం వద్ద ట్యాప్‌ చేయగానే డ్రైవర్‌ వివరాలన్నీ అభయ పరికరంలో నిక్షిప్తమవుతాయి. ఆటో ఎక్కిన తరువాత దారి తెలియని ప్రయాణికులు వారు ప్రయాణిస్తున్న వివరాలను సన్నిహితులకు పంపటం ద్వారా ఎటు వెళుతున్నారో తెలుస్తుంది. స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న యాప్‌లో గమ్యస్థానాన్ని నమోదు చేస్తే.. వెళ్ళాల్సిన మూడు దారులు కనపడతాయి. ప్యాసింజర్‌ ట్రిప్‌ను అంగీకరించగానే ట్రిప్‌ ట్రాక్‌ అవటం మొదలుపెడుతుంది. నమోదు చేసిన రూట్లు కాకుండా వేరే రూటుకు వెళ్లినా.. డ్రైవర్‌ ప్రవర్తన సరిగా లేకపోయినా.. పరికరంలోని ప్యానిక్‌ బటన్‌ నొక్కగానే.. సెకన్‌ల వ్యవధిలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం వెళుతుంది. ప్యానిక్‌ బటన్‌ నొక్కిన సుమారు 100 మీటర్ల దూరంలోనే ఆటో నిలిచిపోతుంది. దీంతో తక్షణమే సమాచారం అందుకున్న పోలీసు సిబ్బంది ట్రిప్‌లో ఉన్న డ్రైవర్‌ ఫోన్‌ నెంబర్‌కు నేరుగా ఫోన్‌ చేస్తారు. తమకు ప్యానిక్‌ బటన్‌ ద్వారా సమాచారం అందిందని, తక్షణమే ఫోన్‌ను వాహనంలో ఉన్న ప్రయాణికులకు ఇవ్వాలని ఆదేశిస్తారు. పొరపాటున నొక్కారా.. లేక ఆపదలో ఉన్నారా.. డ్రైవర్‌ దురుద్దేశంతో ఏదైనా కావాలని రూటు మార్చి వెళుతున్నాడా.. అని ప్రయాణికులనే నేరుగా కనుక్కుంటారు. డ్రైవర్‌ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంటే దగ్గర్లోని పోలీసుస్టేషన్‌కు కమాండ్‌ కంట్రోల్‌ రూము నుంచే సమాచారం అందుతుంది. జీపీఎస్‌ లోకేషన్‌ ట్రాకింగ్‌ ద్వారా బాధితులను రక్షించే అవకాశం ఉంటుంది.

కాంట్రాక్ట్‌ ఆపేసి...

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత అభయం ప్రాజెక్టు సంబంధించిన కాంట్రాక్ట్‌లను రద్దు చేసిందని తెలుస్తోంది. అధికారంలో వచ్చి రెండేళ్లు గడుస్తున్నా విద్యార్థినులకు, మహిళలకు రక్షణ కల్పించే ఇలాంటి ప్రాజెక్టును కనీసం పట్టించుకోవటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు కాంట్రాక్ట్‌ సంగతి దేవుడికెరుక.. ఇప్పుడున్న రవాణాశాఖ అధికారులకు ఈ పథకం గురించి కూడా అవగాహన లేదంటే ప్రభుత్వ పనితీకు అద్దం పడుతోంది. ఇప్పటికై నా మహిళలు, విద్యార్థినులు, యువతులకు భద్రత కోసం చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

గుంటూరు జిల్లాలో మొత్తం 40వేలకుపైగా ఆటోలు ఉన్నాయి. వాటిలో 20 వేల ఆటోలకు అభయం మిషన్‌లు ఏర్పాటు చేయాలని అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మిషన్‌ల ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ క్రమంలో జిల్లాలో అప్పుడు అధికారులు నెలల వ్యవధిలో 2 వేలకుపైగా మిషన్‌లు ఏర్పాటు చేశారు. తొలుత గుంటూరు, వైజాగ్‌, విజయవాడ వంటి ముఖ్య ప్రాంతాల్లో ప్రారంభించారు. ఆ ప్రక్రియ పూర్తిగా సఫలం కావటంతో ప్రతి ఆటోలో బిగించేలా దృష్టి సారించారు. అనంతరం ఎన్నికలు రావటంతో ఆ అభయం ప్రాజెక్టుకు బ్రేకులు పడ్డాయి. అనంతరం చంద్రబాబు సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తరువాత అసలు ఆ విషయాన్నే గాలికి వదలేసింది. రాష్ట్ర ప్రభుత్వ చేతకాని విధానాలతో ప్రాజెక్ట్‌ కొండెక్కింది.

Advertisement
 
Advertisement
Advertisement