తెనాలి: చైనాలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో పతకాలను సాధించిన స్థానిక కేవీకే స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందించారు. గురువారం స్పోర్ట్స్ అకాడమీని సందర్శించిన మంత్రి, అంతర్జాతీయ పతకాలను సాధించిన ఈఎల్ వినయశ్రీ, ఎం.షానూన్‌ను అభినందించారు. క్రీడల్లో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అకాడమీ కోచ్‌లు ఘట్టమనేని సాయి రేవతి, శివరామకిరణ్ రాజులు క్రీడాకారిణుల ప్రతిభను, సాధించిన విజయాలను మంత్రికి వివరించారు.
సత్తెనపల్లి: విత్తన దుకాణదారులు ప్రతి దుకాణంలోనూ ధరల పట్టిక, విత్తన నిల్వల వివరాలు ప్రదర్శించాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు చెప్పారు. పట్టణంలోని పలు విత్తన దుకాణాలను ఆయన గురువారం తనిఖీ చేశారు. విత్తన డీలర్లు రైతులకు తప్పకుండా విత్తన అమ్మకాల బిల్లులు ఇవ్వాలని సూచించారు. ప్రతి రైతు లైసెన్స్ ఉన్న విత్తన అధీకృత డీలర్ నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. రసీదు పంట విత్తన కాలం మొత్తం తమ వద్ద ఉంచుకోవాలని తెలిపారు. నకిలీ పత్తి విత్తనాలు, గ్‌లైసిల్ బీటీ పత్తి విత్తనాలు కొనుగోలు చేయవద్దని సూచించారు. గ్రామాలలో గుడ్డ సంచుల్లో, ప్యాకింగ్ లేని విత్తనాలు అమ్మకాలు జరిపినట్లయితే సమచారం వ్యవసాయశాఖ అఽధికారులకు తెలియజేయాలన్నారు. తనిఖీల్లో సత్తెనపల్లి సబ్‌డివిజన్ సహాయ వ్యవసాయసంచాలకులు బి.రవిబాబు, సత్తెనపల్లి మండల విద్యాశాఖాధికారి బి.సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
యడ్లపాడు: చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన చారిత్రక కొండవీడు కోటపై మరో అరుదైన, ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోటపై దాదాపు 700 ఏళ్ల క్రితం నిర్మితమై, కాలగర్భంలో కలిసిపోతున్న పురాతన షాహీ జుమ్మా మసీదులో ఈ శుక్రవారం సామూహిక జుమ్మా నమాజ్ నిర్వహించనున్నట్లు గుంటూరు నౌ అవర్ హిస్టరీ సంస్థ అధ్యక్షులు, మసీదు అభివృద్ధి కమిటీ ప్రతినిధి సూఫీ ఇమ్రాన్ వెల్లడించారు. ఒకప్పుడు రాజుల కాలంలో వైభవంగా వెలిగిన ఈ మసీదుకు పూర్వ వైభవాన్ని తీసుకురావడంతో పాటు, దీని చారిత్రక ప్రాధాన్యతను భావి తరాలకు అందించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో అరబిక్ విభాగంలో పీహెచ్‌డీ పూర్తి చేసిన ప్రముఖ పండితులు డాక్టర్ మొహమ్మద్ ఇస్తాక్ నద్వీ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు.
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో గురువారం దాత డాక్టర్ తాతినేని గోపాలరావు రూ.30 లక్షల విరాళంతో నూతనంగా నిర్మించిన మెడికల్ రికార్డు విభాగాన్ని (ఎంఆర్‌డీ) ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్‌ఎస్‌వీ రమణ గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం టీచింగ్ ఆస్పత్రిలో ఎంఆర్‌డీ ఎంతో కీలకమని చెప్పారు. జనన మరణాల సర్టిఫికెట్లు మంజూరు విషయంలో ఎంఆర్‌డీ విభాగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మెడికల్ రికార్డు ఆఫీసర్ కందిమళ్ల రామారావు, జింఖానా కోఆర్డినేటర్ డాక్టర్ వెనిగళ్ల బాలభాస్కరరావు, నాట్కో క్యాన్సర్ సెంటర్ కోఆర్డినేటర్ యడ్లపాటి అశోక్‌కుమార్, అడ్మినిస్ట్రేటర్ బచ్చు ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


