● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ బలసాని
గుంటూరు రూరల్: కారంపూడిపాడుకు చెందిన సందు వెంకటేశ్వరరావుది కేవలం టీడీపీ నాయకులు చేసిన హత్యేనని కావాలని పింఛన్ నిలిపివేసి అ తనికి వైద్యం అందకుండా చేసి టీడీపీ నాయకులు హత్య చేశా రని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ప్రత్తిపాడు ఇన్‌చార్జి బలసాని కిరణ్‌కుమార్‌లు ధ్వజమెత్తారు. గురువారం వట్టిచెరుకూరు మండలం కారంపూడిపాడు గ్రామంలో సందు వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించి, సంఘటన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంబటి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి అనుకూలం కాదని కక్షగట్టిన నాయకులు వెంకటేశ్వరరావుతోపాటు మరో ఇద్దరు దివ్యాంగులకు, ఒక డయాలసిస్ పేషెంట్‌కు, ఇద్దరు వృద్ధులకు పింఛను తొలగించాలని ఫిర్యాదు చేయగా రెండు నెలలుగా పింఛన్ నిలిపేశారన్నారు.
టీడీపీ కుట్రకు నిండు ప్రాణం బలి
మృతుడు వెంకటేశ్వరరావు తల్లి వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కొడుకును బతికించుకునేందుకు స్థానికంగా ఉన్న రైస్‌మిల్లులో రోజువారీ కూలీగా పనిచేసేదన్నారు. వచ్చి న కొద్దిపాటి నగదుతో కొడుకును, కుటుంబాన్ని పోషించుకునేందని తెలిపారు. వెంకటేశ్వరరావుకు 2018 నుంచి డయాలసిస్‌కోసం పింఛన్ మంజూరై పింఛన్ వస్తూ ఉండేదని తెలిపారు. ఆ వచ్చే పింఛన్‌తో వైద్యం చేయించుకుంటూ ఉండేవాడ న్నారు. 2019లో తనకు రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపార ని, అప్పటినుంచి క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటూ బతుకుతు న్నాడన్నారు. రెండు నెలలుగా పింఛన్ నిలిపివేయటంతో కనీసం చార్జీలకు కూడా డబ్బులేక ప్రభుత్వాసుపత్రిలో సమయానికి డయాలసిస్ చేయక ప్రాణాలు కోల్పోయాడన్నారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడనే ఒకే ఒక్క కారణంతో స్థానిక టీడీపీ సర్పంచ్ చేసిన కుట్రకు ఒక నిండు ప్రాణం బలైందన్నారు. టీడీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు తిరిగి అతని ప్రాణాలు తీసుకురాగలరా? అని ప్రశ్నించారు. టీడీపీ అధికార దాహానికి ఎందరి ప్రాణాలు బలితీసుకుంటారని ప్రశ్నించారు.
బతిమాలినా కనికరించలేదు..
నియోజకవర్గం ఇన్‌చార్జ్ బలసాని కిరణ్‌కుమార్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు ఓట్లు వేయరనే అనుమానంతో కారంపూడి గ్రామ టీడీపీ నాయకుడు టి. శ్రీనివాసరావు, కొండపల్లి అంకమ్మరావు, సంధు కృష్ణయ్య, సంధు వెంకటేశ్వరరావు, తోటకూర రామారావు, మాదాసు సాంబయ్య, కొండపల్లి వెంకటసుబ్బారావులు మృతుడు వెంకటేశ్వరరావు అక్రమంగా పింఛను పొందుతున్నాడని గత నెల 29న ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారన్నారు. వెంకటేశ్వరరావు బంధువులు టీడీపీ నాయకుడు శ్రీనివాసరావు వద్దకు వెళ్లి కిడ్నీలు పాడైపోయి ఇబ్బందులు పడుతున్న విషయం చెప్పి బతిమాలినా కనికరం చూపలేదన్నారు. కావాలని టీడీపీ నాయకులు చేసిన కుట్రకు ఒక నిరుపేద కుటుంబం నేడు రోడ్డున పడిందన్నారు. వెంకటేశ్వరరావు మృతికి కారణమైన టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పింఛన్ నిలిపేసిన ఆరుగురికి మళ్లీ పునరుద్ధరించాలని డిమాండ్‌చేశారు. మృతుని కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.


