మాతా–శిశు సూపర్ స్పెషాల్టీ బ్లాక్‌లో గురువారం ప్రారంభమైన శస్త్ర చికిత్సలు
గుంటూరు మెడికల్:రాష్ట్రంలోనే తొలిసారిగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి లో ఒకే భవనంలో మహిళలు, గర్భిణులు, శిశువులు, పిల్లల కోసం అత్యాధునిక సౌకర్యాలతో ఉచిత వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు గురువారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా రూ.127 కోట్ల వ్యయంతో 600 పడకలతో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో డాక్టర్ కానూరి–జింఖానా ’మాతా శిశు సంరక్షణ సూపర్ స్పెషాల్టీ బ్లాక్ ’లో మహిళల మాతృత్వానికి సంబంధించిన అత్యంత క్లిష్టతరమైన శస్త్ర చికిత్సల కోసం సిద్ధం చేసిన ఏడు ఆపరేషన్ థియేటర్లు గురువారం నుంచి అందుబాటులోకి వచ్చినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ తెలిపారు. తొలి రోజు (గురువారం)) రెండు ఆపరేషన్లు జరిగాయని, ఇవి కాకుండా శిశువులు, పిల్లల కోసం ప్రత్యేకంగా మూడు ఆపరేషన్ థియేటర్లు సిద్ధం చేశామన్నారు. ఎక్విప్మెంట్స్ పనితీరు గమనించడం పూర్తి కావడంతో అత్యాధునిక సౌకర్యాల మధ్య శస్త్ర చికిత్సలు మొదలయ్యాయి. శిశు సంరక్షణలో కీలకంగా వ్యవహరించే ‘టోటల్ బాడీ కూలింగ్’, హై ప్రీక్వెన్సీ వెంటిలేటర్లు వంటి అత్యాధునిక సదుపాయలు ఈ బ్లాక్ లో కల్పించారు. ఐదు అంతస్తుల్లో 600 పడకల్లో 300 గైనిక్, 120 నవజాత శిశువులు, 12 ఏళ్లలోపు కలిగిన చిన్నారుల కోసం 180 చొప్పున పడకలు కేటాయించారు. నిర్మాణాలకు రూ.100 కోట్లను జింఖానా వారు వ్యయం చేయగా మిగిలిన రూ. 27 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ ఎస్ వి రమణ వెల్లడించారు. ఏడుగురు గైనిక్ ప్రొఫెసర్లు,ఆరుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 18 అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు. 60 మంది పీజీలు, ముగ్గురు సీనియర్ రెసిడెంట్స్ ప్రస్తుతం గైనిక్ విధుల్లో ఉన్నారని తెలిపారు. అత్యవసర చికిత్సలో భాగంగా శిశువులు నిమిషానికి 120 సార్లు గాలి పీల్చుకునే విధంగా హై ప్రిక్వెన్సీ వెంటిలేటర్లు 10 వరకు సూపర్ స్పెషాల్టీ బ్లాక్ లో ఉన్నాయి. గర్భంలో ఉన్నప్పుడు పేగులో చేరే వ్యర్థం ద్వారా శ్వాశ పీల్చుకునేందుకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ’నైట్రిక్ ఆకై ్సడ్’ (వాయువు) సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని పీడియాట్రిక్ విభాగం హెచ్‌ఓడీ దేవకుమార్ తెలిపారు.


