కూటమి నేతల ధనదాహానికి బాలుడు బలి | - | Sakshi
Sakshi News home page

కూటమి నేతల ధనదాహానికి బాలుడు బలి

May 28 2026 1:46 AM | Updated on May 28 2026 1:46 AM

కూటమి నేతల ధనదాహానికి బాలుడు బలి

అక్రమ మైనింగ్‌ క్వారీ గుంతలో పడి ఆరేళ్ల చిన్నారి మృతి ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల్లో అడ్డగోలుగా తవ్వకాలు

గుంటూరు రూరల్‌: కూటమి నేతల ధనదాహానికి బాలుడు బలైన సంఘటన రూరల్‌ మండలంలోని నాయుడుపేట అంబేడ్కర్‌ కాలనీలో చోటుచేసుకుంది. అక్రమ సంపాదన కోసం కూటమి నేతలు స్థానిక ఎమ్మెల్యే అండదండలతో చేస్తున్న 80 అడుగులకుపైగా లోతులో అక్రమ మైనింగ్‌ క్వారీ గుంతలో పడి బాలుడు మృతి చెందాడు. ఇలాంటి సంఘఽటనల్లో ఇప్పటికే ఆరుగురు చిన్నారులు ప్రాణాలను విడిచారు.

శుభకార్యానికి వచ్చి...

ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన కటికల శిరీష, డేవిడ్‌లకు ముగ్గురు ఆడ, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. నాయుడుపేట అంబేడ్కర్‌ కాలనీలో బంధువుల ఇంట్లో శుభకార్యం నిమిత్తం మంగళవారం వచ్చారు. చిన్నకుమారుడు ఆనంద్‌ (6) ఇంటి సమీపంలో సాయంత్రం ఆడుకుంటూ క్వారీ గుంతవైపు వెళ్లి ప్రమాదవశాత్తు పడిపోయాడు. గమనించిన స్థానికులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. సమీపంలోని గజ ఈతగాళ్లకు సమాచారం అందించగా గంటకుపైగా గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా స్పందించకపోవడం, ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంపై వాపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే అనుచరులు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నట్లు ఆరోపించారు.

నిండు ప్రాణం బలి తీసుకున్నారు

అక్రమ మైనింగ్‌ వల్ల ఒక నిండు ప్రాణాన్ని కూటమి నేతలు బలి తీసుకున్నారని వైఎస్సార్‌సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గం సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. చిన్నారి ఆనంద్‌ మృతి చెందడం విచారకరమన్నారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా, ప్రత్తిపాడు నియోజకవర్గంలో అత్యధికంగా అక్రమ మైనింగ్‌ జరుగుతోందన్నారు. బాలుడి మృతి విషయం బయటకు రాకుండా తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేస్తూ, ప్రలోభాలకు యత్నించడం దురదృష్టకరమన్నారు. ప్రతి గ్రామంలో అభివృద్ధి పేరుతో అక్రమ మైనింగ్‌ పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రశ్నించిన వారిని బెదిరిస్తూ భౌతిక దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఎమ్మెల్యే రామాంజనేయులు కనీసం స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు. అధికారుల నిర్లక్ష్యం కూడా ముఖ్య కారణమేన్నారు. బాలుడు కుటుంబానికి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. తక్షణమే మైనింగ్‌ నిలిపివేయాలని హెచ్చరించారు. బాలుడి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement