బాబోయ్‌... భాష్యం! | - | Sakshi
Sakshi News home page

బాబోయ్‌... భాష్యం!

May 27 2026 5:56 AM | Updated on May 27 2026 9:25 AM

40 రోజుల్లో నలుగురు తహసీల్దార్లు...

పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ వైఖరిపై సొంత పార్టీలోనే నిరసన

అడ్డగోలు ఆదేశాలతో తలలు పట్టుకుంటున్న అన్ని విభాగాల అధికారులు

18 ఏళ్లుగా వాటర్‌ ప్లాంట్‌ నిర్వహిస్తున్న టీడీపీ నేత తాళ్లూరి లక్ష్మీనారాయణ

కక్షపూరితంగా వాటర్‌ ప్లాంట్‌ మూసివేయించేందుకు భాష్యం కుట్రలు

మాట వినలేదని విద్యుత్‌ అధికారిని బెదిరించడంతో విధులకు సెలవు

ఇప్పటికే ఎమ్మెల్యే తీరుతో వెళ్లిపోయిన ముగ్గురు అచ్చంపేట తహసీల్దార్లు

సాక్షి, నరసరావుపేట: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో పెదకూరపాడు నియోజకవర్గానికి ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చింది. మిగిలిన నియోజకవర్గాలలోని టీడీపీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, సోషల్‌మీడియా యాక్టివిస్టులపై కక్షకట్టి దాడులు చేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అయితే పెదకూరపాడులో మాత్రం వీరితోపాటు ఏకంగా అధికార తెలుగుదేశం నేతలు, కార్యకర్తలపై ముసుగు దాడులు జరుగుతున్నాయి.

వారిపై అక్రమ కేసులు బనాయించడం, ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలే వాపోతున్నారు. ఇలా ప్రశ్నించిన వారిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడులు చేయడం ఆ నియోజకవర్గంలో పరిపాటిగా మారింది. నెలలు గడుస్తున్నా పోలీసులు సైతం దాడులు చేసింది ఎవరో కనిపెట్టలేకపోవడం గమనార్హం. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ తన ప్రతాపం ప్రస్తుతం ప్రభుత్వ అధికారులపై చూపుతున్నారు. దీంతో బాబోయ్‌ మేం ఈ నియోజకవర్గంలో పనిచేయలేపోతున్నామని పారిపోతున్నారు.

ఏఈకి బెదిరింపులు...
అచ్చంపేట మండలం కోనూరు గ్రామంలో గత 18 ఏళ్లుగా టీడీపీ సీనియర్‌ నేత, మాజీ సర్పంచ్‌ తాళ్లూరి లక్ష్మీనారాయణ మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ నిర్వహిస్తున్నారు. సొంత పొలంలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ ద్వారా 20 లీటర్ల నీటిని కేవలం రూ.3 నుంచి సరఫరా చేయడం ప్రారంభించి ప్రస్తుతం రూ.5కే అందజేస్తూ సొంత గ్రామ ప్రజలకు సేవ చేస్తున్నారు. అయితే సదరు తాళ్లూరి లక్ష్మీనారాయణ కుటుంబం సొంత పార్టీకే చెందిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతో సన్నిహితంగా ఉంటోందన్న నెపంతో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ కక్ష కట్టారని ఎంపీ వర్గం ఆరోపిస్తోంది.

ఇందులో భాగంగా వాటర్‌ ప్లాంట్‌ మూతకు అధికారుల నుంచి ఒత్తిడి తెచ్చారు. వాటర్‌ ప్లాంట్‌ మూసివేస్తున్నారన్న విషయం తెలిసి అదే గ్రామానికి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు భాష్యం ప్రవీణ్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన వీడియోలు వైరల్‌ అయ్యాయి. తనకు జరుగుతున్న అన్యాయం గురించి తాళ్లూరి లక్ష్మీనారాయణ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టీడీపీ కార్యాలయం, కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులకు రాసిన ఉత్తరం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ క్యాడర్‌ను కలచివేసింది.

ఎలాగైనా వాటర్‌ ప్లాంట్‌కు మూత వేయాలని విద్యుత్‌ శాఖ ఏఈ శ్రీనివాసరెడ్డిపై ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చారట. అయితే అప్పటికే తాళ్లూరి లక్ష్మీనారాయణ హైకోర్టుకు వెళ్లి వాటర్‌ ప్లాంట్‌ అడ్డుకోకుండా ఉత్తర్వులు తెచ్చుకోవడంతో తానేమీ చేయలేనని సదరు విద్యుత్‌ శాఖ ఏఈ చేతులెత్తేశారు. రెచ్చిపోయిన ఎమ్మెల్యే ప్రవీణ్‌ తాళ్లచెరువు పబ్లిక్‌ మీటింగ్‌లో ఏఈతో దురుసుగా ప్రవర్తించి బెదిరించారట. లంచం అడిగాడని కేసు నమోదు చేయిస్తానని అనడంతో కేసు పెడతారని భయపడిన ఏఈ ఆందోళన చెంది దీర్ఘకాలిక సెలవులపై వెళ్లిపోయారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. హైకోర్టు ఉత్తర్వులున్నా పట్టించుకోకుండా ఉద్యోగులపై ఒత్తిడి తెస్తే ఎలా అని వారు వాపోతున్నారు.

భాష్యం ప్రవీణ్‌ ఎమ్మెల్యే అయిన రోజు నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో ఆయన వర్గీయులు కొందరు షాడో ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారు. అచ్చంపేట మండలంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల్లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. అడ్డకునే ప్రయత్నం చేస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు. మండల పరిధిలోని కృష్ణానదిపై నిబంధనలకు విరుద్ధంగా బల్లకట్టు, పడవలను నడుపుతున్నారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీతో బల్లకట్టు టెండర్‌ ముగిసింది.

ఏప్రిల్‌ 8, మే 8వ తేదీలలో వేలంపాట నిర్వహించాలని జిల్లా పరిషత్‌ అధికారులు ప్రయత్నించినా స్థానిక టీడీపీ నేతలు వేలం పాట జరగకుండా అడ్డకొన్నారు. ప్రభుత్వానికి ఆదాయం రాకుండా చేస్తున్నారు. తాడువాయి, జింజుపల్లి, మాదిపాడు, చల్లకరిగ, కోగంటివారిపాలెం, పుట్లగూడెం తదితర ప్రాంతాల్లో నిత్యం నదిపై అనధికారికంగా పడవల నడిపి అధికారపార్టీ నేతలు సొమ్ము చేసుకుంటున్నారు. వీరి దోపిడీకి సహకరించని ప్రభుత్వ అధికారులపై కక్ష కట్టి ఇక్కడి నుంచి పంపేస్తున్నారు.

అచ్చంపేట మండలంలో ఆరు నెలల క్రితం ఏకంగా 40 రోజుల్లో నలుగురు ఎమ్మార్వోలు మారారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రజల మధ్యన ఉన్నామన్న విషయం మరచి చెప్పలేని పదాలతో తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే ఎలా పనిచేసేదని, ప్రభుత్వం కలుగచేసుకొని అధికారులపై ఒత్తిడి తగ్గించాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement