పచ్చగడ్డి వేస్తే రియల్‌ భగ్గు! | - | Sakshi
Sakshi News home page

పచ్చగడ్డి వేస్తే రియల్‌ భగ్గు!

May 27 2026 5:56 AM | Updated on May 27 2026 5:56 AM

పచ్చగడ్డి వేస్తే రియల్‌ భగ్గు!

మార్టూరులో అనధికార లే అవుట్ల ధ్వంసం పచ్చనేతల మధ్య ఆధిపత్య పోరే కారణం అధికారులను అడ్డుకున్న తెలుగు తమ్ముళ్లు ప్రజలను దోచుకోవడానికి ఎవరికి వారు ఆరాటం

85 ఎకరాల్లో అక్రమంగానే...

టీడీపీ నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో వారి ఆధిపత్య పోరు కారణంగా ఇటు ప్రజలు నష్టపోవడమే కాకుండా, అటు అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండల కేంద్రం మార్టూరులో అక్రమంగా గతంలో వేసిన, ప్రస్తుతం వేస్తున్న అక్రమ లే అవుట్లను బయట నుంచి వచ్చిన టాస్క్‌ఫోర్స్‌ టీం అధికారులు మంగళవారం ధ్వంసం చేయబోగా తెలుగు తమ్ముళ్లు అడ్డుకున్నారు. ఇంత హఠాత్తుగా లేఅవుట్ల ధ్వంసానికి కారణం మార్టూరుకు చెందిన టీడీపీ నాయకుడే అంటూ మిగిలిన తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మార్టూరు: టౌన్‌ ప్లానింగ్‌ అధికారి అనూరాధ నేతృత్వంలో వేర్వేరు ప్రాంతాల నుంచి సుమారు పదిమంది అధికారులు మంగళవారం మార్టూరు అనధికార లేఅవుట్లను ధ్వంసం చేయాల్సిందిగా ఉన్నతాధికారుల ఆదేశాలపై తాము వచ్చినట్లు అనూరాధ మీడియాకు తెలిపారు. మార్టూరు పంచాయతీ కార్యదర్శి తన్నీరు శ్రీనివాసరావుతో కలిసి మొదటగా పక్క నియోజకవర్గ నేతకు చెందిన అనుచర వర్గం ప్రారంభించిన అనధికార లే అవుట్ను కొంతమేర రాళ్లు తొలగించి ధ్వంసం చేశారు. అనంతరం జేసీబీ, ట్రాక్టర్‌ యజమానులు ఇద్దరూ తమ వాహనాలు రిపేర్‌కు వచ్చాయంటూ అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం.

అడ్డుకున్న నాయకులు

అంతట అధికారులు మరొక జేసీబీ సాయంతో సమీపంలోని జనసేన పార్టీ నాయకుడికి చెందిన లేఅవుట్లోని రాళ్లు తొలగించే ప్రయత్నం చేశారు. సదరు నాయకుడు జేసీబీకి అడ్డంగా నిలబడి మొదట ప్రారంభించిన లేఅవుట్లోని రాళ్లు తొలగించాకే తన భూమిలోకి రావలసిందిగా ఖరాఖండిగా తేల్చి చెప్పాడు. ఎటూ పాలుపోని అధికారులు ఆ లేఅవుట్ను ఆనుకొని ఉన్న మరో లేఅవుట్‌ తాలూకు ప్రహరీని ధ్వంసం చేయబోగా దానికి సంబంధించిన టీడీపీ నాయకులు అక్కడ కూడా అడ్డుకున్నారు. అధికారులు ప్రహరీరి వదిలి లే ఔట్‌లోనికి వెళ్లే మార్గాన్ని జేబీసీతో ధ్వంసం చేయించారు. అనంతరం రాజుగారిపాలెం గ్రామం వైపు వెళ్లే మార్గంలో వేసిన రెండు అనధికార లేఅవుట్లలోని రాళ్లను తొలగించారు.

అసలు సంగతి ఇదా...

ప్రస్తుతం మార్టూరులో కొద్దో గొప్పో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జరుగుతున్న ప్రాంతం స్థానిక హర్షిణి విద్యాసంస్థల పరిసరాల్లో మాత్రమే. మార్టూరు టౌన్‌పై పెత్తనం చేస్తున్న ఇద్దరు ముఖ్య నాయకులలో ఓ మైనారిటీ నాయకుడు ఇటీవల ఈ ప్రాంతంలో కొంత భూమి కొనుగోలు చేసి లేఅవుట్‌ వేసే ప్రయత్నంలో ఉన్నాడు. సదర్‌ లే అవుట్లో ఆ నాయకుడికి తక్కువలో తక్కువ సుమారు రూ.కోటి లాభం రావచ్చనేది ఆ పార్టీ నాయకుల మాటా. ఇక రెండో నాయకుడు స్థానిక జాతీయ రహదారికి ఎదురుగా అత్యంత సుందరంగా అప్రూవల్‌ లే అవుట్‌ను వేసినప్పటికీ విక్రయాలు జరగటం లేదనేది కొందరి వాదన. ఈ సందర్భంగా హర్షిణీ విద్యాసంస్థల పరిసరాల్లోని అనధికారిక లేఅవుట్లను తొలగిస్తే పచ్చనేతకు చెందిన అప్రూవ్డ్‌ లే అవుట్లోని విక్రయాలు పెరుగుతాయనే ఆలోచనతో చక్రం తిప్పినట్లు ఆరోపణలు వచ్చాయి.

టౌన్‌ ప్లానింగ్‌ అధికారులతో ఇలా ఆయనే దాడులు చేయించినట్లు బాధితులు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి బలం ఏమిటో త్వరలోనే తేలుస్తామని మాటల కత్తులు దూసుకోవటం విశేషం. అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకులలో చిచ్చుకు అక్రమ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కారణమై ఆధిపత్య పోరుకు దారితీసిందని ప్రజలు పేర్కొంటున్నారు. దీని ప్రభావం ఇంతటితో ఆగక రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో సైతం ఉంటుందని స్థానికంగా చర్చ జరగటం విశేషం.

మాట్లాడుతున్న టౌన్‌ ప్లానింగ్‌ అధికారి అనూరాధ

ఈ సందర్భంగా మీడియాతో టౌన్‌ ప్లానింగ్‌ అధికారి అనూరాధ మాట్లాడుతూ... మార్టూరు కేంద్రంగా 2009 – 23 మధ్యకాలంలో అనధికారికంగా వేసిన లేఅవుట్లలోని రాళ్లను తొలగించాలని ఉన్నతాధికారులు తమను ఆదేశించారని జాబితా చూపారు. అందులో 25 మంది వ్యక్తులకు చెందిన 50కిపైగా సర్వే నంబర్లలో 85 ఎకరాల విస్తీర్ణంలోని అక్రమ లేఅవుట్లు ఉండటం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement